24, అక్టోబర్ 2025, శుక్రవారం

చిన్న కవితలు

 



జీవం నింపిన మట్టిని  వదిలేసి 

ఆకశపుటంచుల వైపు చూస్తున్నాను

దిగంతాన్ని కొలవాలని. 

అదెక్కడా కానరాలేదు 

నీ ప్రేమ వలె. 

*************

వాన జ్ఞాపకాన్ని విరిబాల బరువుగా మోస్తుంది. 

జ్ఞాపకాలు ఎందుకూ మళ్ళీ ఇప్పుడే వస్తానుగా అంటుంది వాన. 

ఇది వింటున్న రైతు బెంగటిల్లాడు.

అతడలా వెళ్ళిపోయి ఉండొచ్చు

 అతనలా వెళ్ళిపోయి ఉండొచ్చు -డా. గీతాంజలి కవిత ను నేను వినిపించాను. కవిత చాలా బాగుంది. తప్పకుండా వినండీ.. 



కవిత ఇక్కడ వినవచ్చు.. 


23, అక్టోబర్ 2025, గురువారం

వీడ్కోలు చెప్పని పలవరింత

 



వీడ్కోలు చెప్పని పలవరింత  

                            - వనజ తాతినేని 

                               

ఓ సీతాకోకచిలుక  తన రెక్కలు కదుల్చుతూ 

నన్ను పలకరిస్తుంది. 

నా లోచూపు లో బందించబడిన ఆ దృశ్యం 

ఇంకా తాజాగానే ఉంది 

వీడ్కోలు సమయంలో నువ్వు అరచేతిని 

ఇలా కారు అద్దం పై వుంచినట్లు .. 


నువ్వు అర్థం చేసుకునే వుంటావ్!

ఇవతలి వైపున నా అరచేతిని ఆన్చడానికి 

నొప్పి వొకటి సహకరించలేదన్నమాటే కానీ

 కారు ముందుకు కదలడం మాత్రమే నని 

సంశయం మాత్రం కానే కాదని.. 


 గుర్తుంచుకుని శ్రద్ధ తీసుకుని మరీ .. ప్రదోషసమయంలో

మనిద్దరికి ఇష్టమైన సుందరేశ్వరుడి దర్శన భాగ్యాన్ని ఇప్పించడమూనూ..

ఆ తులసి తీర్థం లో గాఢత పరిమళం లాగా

నేనో ఆధారంగా నిలబడతాననే వాగ్దానం 

నువ్వో పుష్పించేనో ఫలించేనో తీగవవుతావు

అనే సందేశం నా ఒంటిని మంటి ని 

ఇంకా అంటి పెట్టుకునే వుందని.


నిజం చెప్పనా!?  వీడ్కోలు తర్వాత 

ఏ తిరనాళ్ళలోనో తప్పిపోయిన పిల్లాడి 

బేలతనం నన్నావహించిందని

ఇది జన్మాంతరం కొనసాగుతుందని. 


(శీలావీ ఫాంట్ తో  ప్రచురింపబడిన కవితా సంకలనంలో)