28, అక్టోబర్ 2014, మంగళవారం

ఓ గీతం వెనుక

చాలా కాలం తర్వాత  ఓ  పాట  నన్ను బ్లాగ్ లో ఓ  పోస్ట్  వ్రాయించింది ఆ పాట  ఎప్పుడూ  వింటూ ఉంటాను . ఎందుకో ఈ రోజు ఆ పాట  వింటూంటే .. చూస్తూంటే  భావేద్వేగంతో  కదిలిపోయాను . ప్రతి  గీత రచన వెనుక ఆ కవి భావేద్వేగం  ఉండకపోవచ్చు . ఆతను  సాధారణంగానే వ్రాసి ఉండవచ్చును. కానీ తెరపై ఆ గీతం కథకి  సంబంధించినదయి .. చూస్తున్న ప్రేక్షకుడిని కదిలిస్తుందన్నది  నిజం .  ఈ పాట  చూస్తున్నప్పుడూ నేను అలాగే ఫీల్ అయ్యాను . కన్నులు చెమర్చాయి . పాటలో  నటుడి నటన నభూతో  న భవిష్యత్.

ఆ పాటకి ముందు సభని ఉద్దేశించి .. ఈ మాటలు ఉంటాయి . (అది ప్రసంగం కాదు అతని దృష్టిలో )


నేను ఒక నాయకుడు , రాజకీయవేత్త, సమాజ సేవకుడు ని కాదు ఇతరుల నుండి పేరు పొందటం  కోసం ఈ టికెట్ కొనడడానికి. నాకు నా ప్రతిభా పాటవాలని ,నా గొప్పలు మీ మీద రుద్దబడ తాయని, చప్పట్లతో స్వాగతిస్తారని .పూల మాలతో అలంకరిస్తారని  తెలిస్తే బహుశా నేనెప్పటికీ  ఇక్కడికి వచ్చేవాడిని కాదు .

ఒక సోదరుడు ఇంకొక సోదరుడి కడుపు నింపుతాడు అంటే అతడు తన భాధ్యత నిలబెట్టు కుంటున్నట్టు. అది ఇతరులపై దయ చూపడం కాదు. నేను ఈ (అనాధ పిల్లలకి) నిరాశ్రయులకి కొంచెం ఇచ్చానంటే అది నా వారి కోసం, నా సోదరుల కోసం ఇచ్చినట్లు. ఎందుకంటే నేను కూడా వీరిలాగే  ఒక నిరాశ్రయుడినే.  ఊహ తెలిసినప్పటి నుండి అమ్మ ఒడి లేదు , నాన్న నీడ లేదు ,పుట్ పాత్  ఒడి, ఆకలి పేదరికమే తోడు నాకు.

నా ఒంటరితనం , తన్నులు ,సమాజం నుండి చీత్కారాలు , ప్రజల తిట్లు . ఇలాంటి స్థితిలో నా బాధని పంచుకునే  వారు ఒకరు దొరికారు . వారికి నా పరిస్థితి మీద జాలి కల్గింది . ప్రేమతో వారు నా తలపై చేయి వేసారు . నేను ఏడుస్తూ ఉండిపోయాను. వారు పాట  పాడి నా గాయ పడిన హృదయానికి మందు పూసారు .  ఆ (ఓదార్పు ) మందు ప్రభావం వల్ల  బతికి ఉన్నాను . లేదంటే ఎప్పుడో చనిపోయి ఉండేవాడిని . ఆ పాట .. ఆ పాట  గాయపడిన  నా హృదయాంతరాలలో   ఇంకా వినిపిస్తూనే ఉంది . మరచి పోలేదు నేను.

నేనెప్పుడూ  ఆ పాటని గల్లీలోనూ , చౌరస్తాలలోనూ  పాడనూ  లేదు . కానీ అప్పుడప్పుడూ నేను పోగొట్టుకున్న, నా బాధని పంచుకున్న వారు గుర్తు వచ్చినప్పుడు , జీవితం పట్ల విరక్తి కల్గినప్పుడూ అప్పుడప్పుడూ (కూనిరాగం ) పాడు కుంటాను . ఈ రోజు నేను అదే పాట  మీరు అనుమతి ఇ చ్చినట్లయితే  . మీ ముందు.ఉంచుతాను .. .

 మళ్ళీ  ఇక్కడ విషయం  ఆపేసి  బ్లాగర్ ని  మీ ముందుకు వచ్చేసానండోయ్!   ఇక్కడి దాకా వ్రాశానా ! ఇక్కడ ఒక చిలిపి ఆలోచన వచ్చింది . ఈ  సంభాషణ  ఏ పాటకి ముందు ఉందొ   ఏ చిత్రం లో ఉందొ .. ఊహించండి ..

ఇది ఒక హిందీ చిత్రంలో పాట . (క్లూ .. ఇంత  వరకే )  మీరు గుర్తిన్చేస్తే  పాటని వినేయండి చూసేయండి .. ఓకే ..నా ఫ్రెండ్స్ !



15, సెప్టెంబర్ 2014, సోమవారం

అవే ముఖచిత్రాలు

అవే ముఖ చిత్రాలు ..

అన్నిచోట్లా... నామ వాచకం
మోసగించేవాడికి మోసపోయామనుకునే వారికి 
వేదిక ఎక్కడైనా కావచ్చు వేడుక రూపం మారవచ్చు
విషయం మాత్రం ఎప్పుడూ ఒకటే !
ఆవాంచిత స్నేహాల వల వేసి ఒడిసి పడుతున్న వ్యాఘ్రాలెన్నో
మాటల తీయదనంలో మోసపోతున్న చంచితలెందరో !
భ్రమపడి పొరబడి జీవితాలని కాల్చుకున్న అభిసారిక లెందరో
చిత్తకార్తె కుక్కల వలే ఆ కక్కుర్తి ఏలనో!?
వీడు ఇంటిలో పురుష పుంగమా?
పరుల ఇంట పర పురుష భుజంగమా !?
కాల సర్పం కాటుకి బలి అయ్యేదెన్నడో?


కొన్ని చోట్ల ... సర్వ నామం


స్నేహంలో ప్రేమ ప్రేమలో స్నేహం
ఏది ఎందులో ఉండక పోయినా ఆశ్చర్యం ఏమీ లేదు
కానీ ప్రేమలో నమ్మకం లేవక పోవడమన్నంత
విచారం ఇంకోటి లేదు, అంతకన్నా అవమానం వేరేకోటి లేదు
అవమానింపబడ్డ ప్రేమలో తడిమి తడిమి తడిని కాంచడమంటే
ఎడారిలో ఒయాసిస్ కై అన్వేషణే !
ఆత్మాభిమాన బలం మెండుగా ఉన్న ఆ చెంత
చీత్కారం తప్ప ఏమి విదల్చని చోట
కపట వేషాలు, మోసాలు ఆ మాత్రం తెలియనివా ?
అతివల అంతరంగాలోచానలపై పై అంత చిన్న చూపు ఏమిటో!
మారండి.. మారండి తల్లులూ
మసిపూసి మారేడుకాయ అని చెప్పేస్తే నమ్మకండి
ముఖ చిత్రాలని నమ్మకండి
మనసు చిత్రాలని ఆవిష్కరించుకోండి




28, జూన్ 2014, శనివారం

అభివృద్ధికి అధ్బుత దీపం ఉందా?

అభివృద్ధి మాట వింటే అసహనం కొందరిలో ....
జరిగేది అభివృద్దే కాదంటారు . అలాంటప్పుడు నా ఆలోచనలు ఇలా ఉంటాయి
జరుగుతున్నది అరకొర అభివృద్ధి అయితే పూర్తి అభివృద్ధి చేయడం ఎవరివల్ల సాధ్యం ? నాయకుల చేతిలో అద్భుత దీపం ఉందా ?

విశ్వమానవ సమానత్వం ,శ్రేయస్సు దృష్ట్యా ఖండాలమధ్య హద్దులే చెరిగిపోతున్నాయి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అందరికి అందుబాటులోకి వస్తుంది ఆ ఫలితాలని అనుభవిస్తూనే అభివృద్దిని వ్యతిరేకించేవారిని చూస్తున్నాం ప్రపంచంలో అన్ని దేశాలు అభివృద్దిని కాంక్షించే క్రమంలో మూలాలని ,సంస్కృతిని విచ్చిన్న చేస్తూనే ఉన్నారు. సహజ వనరులని మితిమీరి వాడుకుంటూ పర్యావరణ సమతుల్యానికి చేటు చేస్తూనే ఉన్నారు తప్పనిసరై కొంత,మానవ నిర్లక్ష్యం కొంత, మితిమీరిన స్వప్రయోజనాలు మరి కొంత.

అభివృద్దిని కాంక్షిస్తూనే మూలాలు మిగిలి ఉండాలని భావించే వారు మానవ నాగరికత అభివృద్ధి ఎలా చెందిందో గమనిస్తూనే మనం ఎలాంటి ఫలాలని అనుభవిస్తున్నామో గుర్తెరగాలి ..

ఉదాహరణకి కొన్ని .. మనం అదివరకు కట్టెల పొయ్యి వాడేవాళ్ళం . కట్టెలు కోసం చెట్లని నరికేవాళ్ళం . (అవి కాకుండా ఇంకా చెట్ల అవశేషాలు కంది కంప, ఎండిన మామిడి కొమ్మలు,పేడ ఊకతో తయారయిన పిడకలు కర్ర బొగ్గులు ఇలా ) చెట్లు నరకడం వల్ల పర్యావరణ నాశనం అని అర్ధం కాకపోయినా పొగ లేని పొయ్యిలు కూడా వద్దనుకుని గ్యాస్ వాడకం అందరికి అందుబాటులోకి వచ్చింది సహజంగా లభించే గ్యాస్ ని వెలికి తీసి వాడటం అభివృద్ధి,  బయో గ్యాస్ వాడకం అభివృద్దికి సూచకం, సోలార్ విధ్యుత్ అభివృద్దికి సూచకం

చెట్లని నరకడం  వల్లపర్యావరణ నాశనం జరుగుతుందని నరకడం ఆగిందా ? మిగిలిన అనేక అవసరాల కోసం  చెట్లు నరుకుతూనే ఉన్నారు ఇలా అభివృద్ధి క్రమంలో మనం  గమనించాల్సినది చాలా ఉంది .. మితిమీరిన సెల్ ఫోన్ వాడటం వల్ల టవర్స్ పెరిగి రేడియేషన్ వల్ల పిచ్చుకల లాంటి ప్రాణులే అంతరించి పోతున్నాయి .. మరి మనం సెల్ పోన్ వాడటం ఆపేసామా ? ఎయిర్ కండీషన్ వాడకం ఆపేసామా? మనవంతు ఏమి చేయకుండానే పర్యావరణాన్ని నాశనం చేస్తూనే అభివృద్ధి ఫలాలని అనుభవిస్తూనే అభివృద్దిని విమర్శించడం తగునా ? 

నిజమైన అభివృద్ది ఫలాలు అందేదాకా వేచి వుండే ఓపిక  అందరికి ఉందా?  ఇది ఆలోచించే విషయం కదా ! విధ్యుత్ కోతని నిరసిస్తున్నాం.. విధ్యుత్ లేకుండా ఉండటం అలవాటు చేసుకుంటే సహజ వనరులైన బొగ్గు బర్న్ అయ్యే పని ఉండదు.,. పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది కదా ! కానీ మనం అలా ఉండగల్గుతున్నామా?

కులం మతం ప్రాంతం రాజకీయాల్ని మోస్తున్నాయి
ధన స్వామ్య వ్యవస్థలోనే ప్రజాస్వామ్యం అనే అప్రజాస్వామ్యం వేళ్ళూనుకుంటుంది ఏ రాజకీయ పార్టీ అయినా కార్పోరేట్ కనుసన్నలలోనే మెలుగుతుంది .. రాజకీయ పార్టీల మనుగడకి అధికారంలోకి రావడానికి వారి డబ్బు చాలా అవసరం.  అధికారంలోకి వచ్చాక కార్పోరేట్ రంగానికి పెద్దపీట వేయడం ప్రభుత్వాల పని..
సంస్కరణ ఎవరివల్ల సాధ్యం.. ? ప్రజలు ఓటు విలువని నోటుతో,. సీసా మందుతో అమ్ముకున్నరోజే వారిని ప్రశ్నించే హక్కు కోల్పోతున్నారు.   ప్రజాలేమన్నా తక్కువా? వీళ్ళకి స్వప్రయోజన చింతన లేదా చెప్పండి ? 

అభివృద్దికి గనులు అవసరమే.,.పరిశ్రమలు.,. ,ప్రాజెక్ట్లు అవసరమే ! ఆ అభివృద్ధి ముసుగులో స్వార్ధప్రయోజనాల కోసం అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డదిడ్డంగా దోచేస్తూ పేదల మీద అబలల మీద దాడులు చేసేవారిని తప్పకుండా ప్రశ్నించాలి. వారి తరపున ముందు నడిచేవారిని అభినందిద్దాం.. అంతే కాని అభివృద్దిని వ్యతిరేకించవద్దు అభివృద్ధి గమనం లో మానవ నిర్లక్ష్యాన్ని గుర్తుచేస్తూ అభివృద్దికి కొత్త భాష్యం చెప్పేవారి మాటలని గౌరవిద్దాం. 
ప్రాజెక్ట్ ల నిర్మాణంలో ఆదిమవాసిప్రజలందరూ వారి ప్రాంతాలకి దూరమయ్యారు . వారికి చాలా నష్టం జరిగి ఉంటుంది.    తెహ్రి డాం నిర్మాణం వల్ల ఎన్నో రాష్ట్రాలకి ముప్పు ఉందని ఆ డాం నిర్మాణం ఆగిందా ? ఎప్పుడు ప్రాజక్ట్ లు కట్టినా ఏదో ఒక వివాదం ఉంది. అంతెందుకు .. కొన్నేళ్ళ క్రితమే నిర్మితమైన "శంషాబాద్ " విమానాశ్రయ నిర్మాణంలో నష్టపోయింది చిన్నా చితక రైతులు కాదా !? ప్రజలకి పర్యావరణం మీద ప్రేమ కన్నా రాజకీయ పార్టీలకి కొమ్ముకాయడం ఎక్కువైపోయింది. ప్రత్యేక ఆర్ధిక మండల్లు పేరిట సేకరించి బహుళజాతి సంస్థలకి ధారాదత్తం చేసిన భూమి కన్నా సొంత రాజధానికి సేకరించిన భూమి పైనే విమర్శలు ఎక్కువయ్యాయి. త్రాగు నీళ్ళకి ఎంత కట కటో హైదరాబాద్ లో అనుభవించి వచ్చారు. భవిష్యత్ తో అలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలనే నదీ తీర ప్రాంతం, అందరికి అనుకూలంగా ఉండే ప్రాంతాన్ని ఎన్నుకున్నారు. భవిష్యత్ లో ఇబ్బందులు కలుగకూడదనే ముందు చూపుతో రాజధాని నిర్మాణం సాగుతుందని ఎందుకు అర్ధం చేసుకోరు ? 

చేతికి చిప్ప ఇచ్చి పంపిస్తే... ఇలాంటి పరిస్థితులల్లొ ఏ పార్టీ నుంచి ఎంపిక కాబడ్డ ముఖ్యమంత్రి అయినా ఏం చేస్తారో ఆలోచించండి. కాస్త నిజాయితీగా పని చేసేవాళ్ళని గౌరవించండి. ఓపిగ్గా పనులు చేయించుకోవడానికి వాళ్ళకి అవకాశం ఇవ్వండి.   ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూసి ... మోసపోకుండా . . ఎవరికీ వారు వ్యక్తి అభివృద్ధి గురించి ఆలోచించుకుంటూ ...తర్వాత సమాజం గురించి ఆలోచించడం మంచిదని తెలుసుకుంటే ... నాయకులపై ఆశలుండవు. వాళ్ళు మాత్రం దేవుళ్ళేమికాదు. వాళ్ళ ఆశలు,వాళ్ళ ఆకళ్ళు తీరినాకనే ప్రజల గురించి ఆలోచిస్తారు. ఈ మాత్రం అవగాహన ఉన్నవాళ్ళు ఎవరూ పదే పదే నాయకులని తిట్టరు. 

భావప్రకటన స్వేచ్ఛ మనహక్కు ... ఆ హక్కుని అల్ప విషయాల పట్ల, కాలక్షేపపు బఠానీ కబుర్లకి అతిగా వాడేసి అసహనం పెంచుకోవడం తప్ప ... మంచికి ఉపయోగించుకోవాలని తెలుసుకోలేకపోవడం  శోచనీయం.     


అభివృద్దికి గనులు అవసరమే.,.పరిశ్రమలు.,.ప్రాజెక్ట్లు అవసరమే ! ఆ అభివృద్ధి ముసుగులో స్వార్ధప్రయోజనాల కోసం అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డదిడ్డంగా దోచేస్తూ పేదల మీద అబలల మీద దాడులు చేసేవారిని తప్పకుండా ప్రశ్నించాలి. వారి తరపున ముందు నడిచేవారిని అభినందిద్దాం.. అంతే కాని అభివృద్దిని వ్యతిరేకించవద్దు అభివృద్ధి గమనం లో మానవ నిర్ల్క్ష్యన్ని గుర్తుచేస్తూ అభివృద్దికి కొత్త భాష్యం చెప్పేవారి మాటలని గౌరవిద్దాం