2, జులై 2023, ఆదివారం

సంతోషపు ఊపిరి

 నాన్న కొని తెచ్చిన 

పిల్లనగ్రోవిని అందుకున్న పిల్లవాడు 

అమ్మ పక్కన పడుకుని ఎపుడెపుడు 

తెల్లవారుతుందా అని ఎదురు చూసాడు 


వేకువనే లేచి వడి వడిగా గుట్ట లెక్కి

తన స్నేహితుడి కోసం వేచి చూసాడు 

అప్పటి దాకా చంద్రునితో ఊరేగిన పిల్లగాలి 

ఎదురు చూస్తుంది 

కాస్త సూర్యోదయాన్ని తాగి వెచ్చబడాలని. 


వెలుగుజుత్తు లేసుకుని 

కొండల చాటునుండి నెమ్మదిగా 

పైకి వస్తున్న సూరీడు.. 

పిల్లవాడు పిల్లగాలి 

ఇద్దరూ స్నేహితుడిని చూసారు  


ఇదిగో.. నాన్న తెచ్చిన బహుమతి చూసావా.. 

అంటూ ఉత్సాహపు ఊపిరిని వేణువులో పూరించాడు

పిల్లగాలి అతనికి తోడైంది. 

వేణువొలికించిన మధుర  స్వరాలతో 

ప్రకృతి పరవశంతో ఊగిపోయింది. 


పిల్లవాడు  రోజూ సంతోషపు చొక్కా 

తొడుక్కొని కనిపించ సాగాడు 

అమ్మ నాన్నలకు.


-వనజ తాతినేని

01/07/2021  11:10 AM

Pic courtesy: Google.



1, జులై 2023, శనివారం

కొన్ని సూర్యోదయాలు


 

1. ఆయన వచ్చాడు. వేకువ నే 04:15 కి లేచి యెదురుచూస్తున్నా. ఇప్పటికి వచ్చాడు.. తన లేత కిరణాలతోనే తీక్షణ ను తెలియజేస్తూ.. మరి కాల్చకపోతే శుభ్రపడేది యెలా! 

ఈయనతో పాటు.. మనుమరాలు కూడా వచ్చింది. పళ్ళు తోమకుండా తప్పించుకునేందుకు.. నాయనమ్మ రక్షణగా నిలబడుతుందని. నాయనమ్మ కూడా కఠినాత్మురాలే.. కనబడే ఆయనతో పాటు 😊😊 ఎత్తుకుని తీసుకువెళ్ళి అమ్మకో నాన్నకో అందించి వస్తుంది. (మనసులో వేయి క్షమాపణలు చెప్పుకుంటూ)

2. ఇదిగో.. ఈయన వచ్చేసాడు.. వెలుగుజుత్తులేసుకుని. 

రోజూ చూసే సూర్యోదయమే! కానీ నిత్యనూతనం. 

వెలుగునీడలు మనకు ఎన్నో సత్యాలను బోధ పరుస్తాయి. 

కిరణాల రంగులే.. మనకు ప్రకృతి అంతా కనబడేరంగులు. 

నా అముద్రిత కథలో .. ఈ వాక్యం రాసుకున్నాను. 

“జీవితం వృధా కాకూడదు నీ ప్రేమ వృథా కాకూడదు. 

ఇచ్చుకున్నవాళ్ళు ఇచ్చినంత పుచ్చుకున్నవాళ్ళు పుచ్చుకున్నంత” అని. 

రోజు వృధా కాకూడదు.. అని సూర్యుడు నుండి పాఠం నేర్చుకుందాం. 

లోకమిత్రాయనమః 🙏


3. లోక మిత్రునితో.. నా సంభాషణ:

నా భావనా ప్రపంచానికి మూలం ప్రకృతి యే కదా!

నీవు రాక పూర్వం మరొక తావున వుందువని నాకు పదేళ్ళు వచ్చాక చదువుకున్నాను. మా ఉనికికి ఆధారమైన నేలపై నిలబడి మా చుట్టూ మేము తిరుగుతూ నీ చుట్టు కూడా తిరుగుతున్నామని.

 ఉదయపు నడకలో వొంటరిగా అడుగులు వేస్తూ…ఇలా ఆలోచన చేస్తుంటాను మానవ నిర్మితమైన ఈ రహదారులు ఏర్పడకముందు ఇదంతా ఓ పచ్చిక సముద్రమో కొండలో బండలో నిండిన నిర్జనారణ్యమే కదా! అప్పుడూ యిప్పుడూ నీ దయావర్షం సమానమే కానీ.. ఇప్పుడు మరికొంత ప్రచండం ఈ సకల జీవకోటికి నొప్పి ని కలుగజేస్తుంది అంటే అది మనిషి తప్పిదమే కదా! 

విజ్ఞాన వీధుల్లో సంచరించడం అంటే ప్రకృతి ని ప్రేమించడం గౌరవించడం పూజించడం. నా వంతు భాద్యతగా ..  చెబుతుంటాను. చేస్తుంటాను. 

Save Soil 🌍

save trees 🌲  🌳 

Save  Water 💦 

Save power 🔌🛥️ 

Save food 🥘 🌾 

Save  money 💰 

ఫలితం మనది కాకపోయినా.. ప్రయత్నం విడనాడకూడదు. మనం ఇలా వున్నామంటే పూర్వీకుల పుణ్యఫలమే కదా!

ఉదయరాగం -వనజ




26, జూన్ 2023, సోమవారం

వ్యాపకాల వాతలు



 వ్యాపకాలు వాతలు పెట్టుకున్నట్లైతే యెలాగబ్బా!  

కడుపునిండిన మహిళలకు ఫోన్ ల ద్వారా బాధలు గాధలు పోసుకోలు కబుర్లు చాడీలు చెప్పుకోవడం కూడా పాతదైపోయింది. సీరియల్స్ కూడా విసుగెత్తిపోయాయి. చీరలు మ్యాచింగ్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్లు స్టీల్ సామానులాగా సాధారణం అయిపోయాయి. అమెరికా కబుర్లు మరీ సాధారణం అయిపోయాయి.  ఆకాశం నీలిమేఘచ్చాయలోకి మారిన తర్వాత వెలుగు తగ్గినట్లు స్త్రీల ముఖాల్లో కూడా వెలుగు తగ్గి నిరాశ కమ్మి కొత్తగా ఏం చేయాలా అని అన్వేషణ మొదలు పెట్టగా.. వారికి పెన్నిధి దొరికింది.  మిద్దె తోటలు బాల్కనీ గార్డెన్స్. ఆ అవకాశం లేనివారికి  టిక్ టాక్ వీడియోలు రీల్స్. అవి రాజ్యమేలుతుండగానే.. సమాంతరంగా ఫేస్ బుక్ ఇన్స్టాగ్రామ్ టిట్వర్ వాట్సాప్ స్టేటస్ లు. ఇప్పుడేమో ప్రతి ఒక్కరికి యూ ట్యూబ్ చానల్స్. మూడు చుక్కల ముగ్గు పెట్టడం దగ్గర్నుండి థమ్ బిర్యానీలు ప్రపంచయాత్రల సాహసోపేతర వివరాలు పంచుకోవడం దాకా వచ్చి ఆగింది. కిచెన్ బాల్కనీ తోట నగలు గాజులు బొట్టుబిళ్ళలు ఈ రోజు వండిన కూర మధ్య రకరకాల మసాలాలు గుప్పించి వండిన సినిమాలు సీరియల్స్ అంతే శ్రద్దగా వండిన వార్తలను దాటేసి ఈ వీడియోలనే చూస్తూ.. సంభ్రమఆశ్చర్యాలతో అన్నం తినడం గాకుండా వీడియోలు చూసి బతికే ఇల్లాళ్ళు. పోనీ వీరు చూసి ఊరుకుంటారా.. వీడియో చూడటం ఆ వస్తువు కోసం ఆన్లెన్ ఆర్డర్ పెట్టడం.. లేకపోతే మార్కెట్ కి పరుగులు దీయడం. భక్తి ఆహారం వస్త్రాలు అలంకరణ సామాగ్రి గా లోహ వస్తువులను కొనడం విపరీతంగా పెరిగిపోయింది. కొనుక్కోవడం తప్పేం కాదు కానీ ఇరుగమ్మను పొరుగమ్మను చూసి వాతలు పెట్టుకోవడం సర్వసాధారణం అయిపోయింది. పూర్వం మన ముందుతరాల వారు పొలం బంగారం కొనుక్కొని ఆదాయాలను భద్రపరుచుకునేవారు. ఇప్పటి వారు అప్పులు చేసైనా ఆడంబరంగా బతకడం ఆనందం వస్తువుల్లోనే వుందనుకోవడం లోకి వచ్చేసారు. 


చదువు వైద్యం ఇంటి అద్దెలు కిరణా ధరలు కూరగాయల నాన్ వెజ్ ల ఖర్చులు పెరిగి భార్యభర్తలిద్దరూ అర్హతలకు తగినట్లుగా పనులు చేస్తూ కష్టపడి.. వస్తువినియోగానికి 60% వరకూ ఖర్చు పెట్టడం సాధారణం అయిపోయింది. మొదటి తారీఖు నే కష్టపడిన రూపాయికి రెక్కలొచ్చి యెగిరిపోతున్నాయి. 


అభిరుచులు వుంటే.. అవి కూడా నెరవేరడం సులభం కాదు ఇప్పుడు. మధ్యతరగతి ప్రజలు కాలక్షేపం కోసం చేసే పనుల వల్ల ఎంతోకొంత ఖర్చు తప్ప  వ్యక్తిగత అభిరుచి నెరవేరి సంతోషం మిగిలే సంగతి చాలా తక్కువ. మనిషి బాహ్య సంతోషాలను వెతుక్కుంటూ  అలజడితో  లోన ప్రశాంతతను పోగొట్టుకుంటున్నాడు. 


హస్తభూషణంగా మారిన మొబైల్ మూలంగా ప్రతి ఇంట్లో ఖర్చు ఆడంబరం పెరిగిన మాట వాస్తవం. అమాయకమైన స్త్రీలు కూడా రకరకాల వ్యామోహాల్లో చిక్కుకుని చేతులు కాలాకా ఆకులు పట్టుకుంటున్నారు. నియోరిచ్ కుటుంబాల స్త్రీలను చూస్తూ వారిని అనుకరించాలని ప్రయత్నించకూడదు. వారికి ప్రదర్శించుకోవడం అవసరం. అందుకు మరియు కాలక్షేపం కోసం వీడియోలు చేసి వదులుతారు. పైగా పిచ్చి జనం ఎంతమంది చూస్తే వారికి అంత ఆదాయం వుంటుందట. చూసేవాళ్ళు పనీపాటా లేకుండా సోమరిపోతుల్లా వుండిపోతే వారు బిజినెస్ క్లాస్ లో విమానాల్లో ప్రయాణిస్తూ.. మళ్ళీ వాటిని కూడా వీడియోలు తీసి వదులుతున్నారు. ఇంకొక విషయం ఏమిటంటే చిన్న పిల్లలు కూడా అన్నీ మాకు తెలుసు అంటున్నారు. ఎలా తెలుసు అంటే.. యూ ట్యూబ్ లో చూసాం అంటున్నారు. ఇక పెద్దలు చెప్పే విషయాలు నేర్పే పనులు గురువులు ఏమి అవసరం లేదు అనే స్థితికి చేరుకుంటున్నారు. మహిళలు విద్యార్ధులు ఖాళీ సమయాలను సద్వినియోగం చేసుకుని మానసిక వికాసానికి పనికి వచ్చే అభిరుచులు పెంపొందించుకుంటూ  కుటుంబ ఆర్ధిక ప్రగతికి తోడ్పడుతూ  పొదుపుగా బతకడం అలవాటు చేసుకోవాలి. ఇద్దరు కష్టపడి సంపాదించేది అంతా కూడా చెడిబడీ కొనేస్తే.. అవసరం అయినప్పుడు ఆదుకునేవారు లేక అలమటించిపోవాలి. 


వస్తువుల ఉత్పత్తి అంచనాల మేరకే తయారుచేయడం వుంటుంది. మితిమీరిన అవసరాలు వచ్చాయంటే అది విపత్తులు సంభవించినప్పుడే జరుగుతాయి. ఉత్పత్తి కి వినియోగానికి మధ్య అవసరం అనేది ఎంత వుంటుందో అనవసరం అనిపించడం కూడా అంతకన్నా ఎక్కువే వుంటుంది. ప్రస్తుతం ప్రపంచమంతటా అలాంటి వ్యాపారమయ ప్రపంచంలో మనం బ్రతుకుతున్నాం. లాభాలు కొందరివే ఇక్కట్లు ఎక్కువమందివి. ఆ ఆలోచనతోనే ఇది 100% నా అభిప్రాయంగానే ఇది రాసాను. 


(యూ ట్యూబ్ లో వీడియోలు చూసి అప్పులు చేసి వన్ గ్రామ్ నగలు బ్రాస్ ఐటమ్స్ మొక్కలు పింగాణీ కుండీలు కొనడం రోజూ పూజలు చేయడం అనే వలలో చిక్కుకున్న ఒక పరిచితురాలిని చూసి ఈ స్పందన)


నక్క నీలిరంగు బానలో మునిగిందట.. ఎందుకు? 

కథ తెలిస్తే చెప్పండి.