16, నవంబర్ 2018, శుక్రవారం

ప్రేమలేఖ

నీతో కలిసి అడుగులేస్తుంటే  
నడిచే గ్రంధాలయం  తోడున్నట్లు 
నువ్వు పెదవి విప్పితే 
నేను  రాగ దర్బార్ లో ప్రవేశించినట్లు 
కళ్ళు కళ్ళు కలుసుకుంటే కలలు 
సీతాకోకచిలకలై  యెగురుతున్నట్లు 
చేతిలో చెయ్యేసి నడుస్తుంటే 
నిండుగా పూచినవనంలో నిలువెల్లా తడిచినట్లు 
ఎన్నాళ్ళకైనా  
నా అనుభవంలోకి వచ్చిన నిన్ను స్వీకరిస్తూ 
దేహం దేహంలో ముంచినట్లు కలాన్ని సిరాలో ముంచి    
సంపూర్ణ ప్రేమలేఖ వ్రాయాలనుకున్నా... 

నా లోలోపల ఓ  స్వేచ్చా పిపాసి  దాక్కుని
నను  వశీభూతుడుని చేసుకోవాలని పన్నాగం
ఈ ఉద్వేగాలని ఉన్మత్తాన్ని దాటెల్లి 
జీవితాన్ని చూడాలని 
ఉన్నదానితో వుత్సవం చేసుకోవాలని
జీవితాన్ని రసభరితం చేసుకోవడం నేర్చుకోవాలని
ఎల్లప్పుడూ భోధిస్తూ వుంటాడు
తుదకు విజయుడయ్యాడు 

లోనికి రానిదల్లా ఓ అసంపూర్ణ చిత్రపటమేనని   
నిన్ను అనవసరంగా మోస్తున్నానే బాధనుండి విముక్తి కల్గించిన 
ఆ ప్రేమికుడికి కృతజ్ఞత తెలుపుకుంటున్నా 
అందుకే...
నడిచొచ్చిన రాతిమెట్ల కాలానికి వినయంగా  నమస్కరిస్తున్నాను 
 ఇన్నేళ్లు జారకుండా ప్రేమగా హత్తుకున్నందుకు 
ఇకపై అడుగులు కలిసి వేస్తున్నందుకు. 

11, నవంబర్ 2018, ఆదివారం

రాజేష్ చేర్తాల స్వర జన సమ్మోహితం

సంగీతం సర్వ జన సమ్మోహితం.






నాలుగైదు నెలల కాలంగా రాజేష్ చేర్తాల (Rajesh Cherthala Professional Flute Instrumentalist).నన్నావహించాడు.  నిద్ర లేచింది మొదలు నిద్రలోకి జారుకునే వరకూ  వింటూనే వున్నాను. అలసినప్పుడు సేదదీర్చే చిరుగాలి తరగల్లేనూ    నిదురరానప్పుడు అమ్మలా జోలపాడుతున్నట్టు  అశాంతిగా వున్నప్పుడు సాంత్వన కలిగించే ఆప్తమిత్రుడిగానూ .. ఏమీ తోచనప్పుడు సంగీతం వినడమే ప్రాధాన్యమైనట్టూ భలే నా చుట్టూ గాలికిమల్లే తారట్లాడతా వున్నట్టు వుంటున్నాడు . అతని గురించి చెపుతూ  ముందుగా నా సోత్కర్ష కూడా ...

నాకు వేణువు సంగీతం విడదీయరాని వస్తువులుగా నాకనిపిస్తాయి. చిన్నప్పటినుండి వేణునాదం విన్నప్పుడల్లా నాదస్వరానికి కదిలే నాగులా ఊగిపోతుంటాను.  ఎందుకో యేమిటో  అసలు తెలియదు.  మనసు ఆలోచన ఎంతో తేటగా ఉంటాయి. పండిట్ హరిప్రసాద్ చౌరాసియా, భూపేన్ హజారికా, మరకత మణి కీరవాణి నాకత్యంత యిష్టమైన సంగీతకారులు. ఇప్పుడు పండిట్ హరిప్రసాద్ చౌరాసియా శిష్యుడే అయిన రాజేష్ చేర్తాల తన వేణు గానంతో వంశీరవం పట్ల మరింత మోహాన్ని పెంచుతున్నాడు. అతని వేణు గానాన్ని వింటూ ఇతర భాషా చిత్రాల పాటలని వింటూ ఆసక్తిగా ఆ పాటలు గురించి తెలుసుకుంటూ సంతోషంలో వోలలాడుతూ వున్నాను.

నా బ్లాగ్ శీర్షిక కూడా వనజ వనమాలి అని వుంటుంది. ఎందుకంటే వనమాలి అంటే యెవరోకాదు. నా  ఆధ్యాత్మిక గురువు   మానసిక ప్రపంచంలో ఆరాధకుడు మురళీ ధరుడే గావున చటుక్కున ఆ పేరు పెట్టేసుకున్నాను.  నా కథలలో కూడా పిల్లనగ్రోవి ప్రస్తావన బాగానే ఉంటుంది. (పాట తోడు కథ)  నా కలల్లో కూడా వేణు నాదమే కనబడుతూ వుంటుంది. నాకిష్టమైన పాటలు అంటే కచ్చితంగా మురళీరవం వినబడుతూనే వుండాలి. లేకపోతే ఎంత మంచి పాటైనా నాకు  నచ్చదన్నమాట.  అలా వేణువుకి నాకు విడదీయరాని బంధం. కాస్త ఖాళీ దొరికితే చాలు  చైనీయుల వేణు గానాన్ని వెతుక్కుంటూ వుంటాను. వారి సంగీతం ఇంకా పచ్చిగా గాఢంగా హత్తుకుంటుంది కాబట్టి. సంగీతంలో చేరాల్సిన గమ్యం అది. రాజేష్ చేర్తాల వేణు గానంలో అది పూర్తిగా ఉంటుంది.

ఎంతవిన్నా తనివి తీరనిది  వినడానికి మన శక్తి చాలనిదీ  సంగీతం వొక్కటే. వొడలు మరిపించేది పట్టరాని అనుభూతిని కల్గించేది స్పర్శ లేనిదీ  చెవుల ద్వారా హృదయాన్ని తాకేది సంగీతం వొక్కటే. అదియునూ  వేణుగానమొక్కటే నా దృష్టిలో  :) నాకు నచ్చిన పాటల జాబితా  చెప్పాలంటే అది చాలా పెద్దది. నాలుగురాత్రుళ్లు పగళ్లు కూడా చాలవు. పెద్ద పెద్ద గ్రంధాలు,కావ్యాలు చదవలేదు, సంగీతంలో ఓనమాలు నేర్చుకోలేదు కానీ నా సమకాలీనులను నూరులో ఒకవంతు చదువుతూ నాకన్నా ముందుతరం వాళ్ళని రెండొంతులు చదువుతూ యేదో యిలా ఆనందంగా బతికేస్తున్నాను.ఇదిచాలు.
పరమేశ్వరుడుని పుట్ట తేనెతో అభిషేకిస్తే స్వరజ్ఞానం తీయనైన స్వరం లభిస్తాయని మా నాయనమ్మ అనేది. అంతా భగవత్ కృప. ఇలా ఆస్వాదించే అనుభూతి చెందే కాస్త జ్ఞానాన్ని అయినా యిచ్చినందుకు ఆ ఆది సంగీతకారునికి నమస్సులు అందిస్తూ ...

రాజేష్ చేర్తాల ని మీరూ   వినాలని కోరుకుంటూ ...  అతనికి కూడా ఎంతో ఇష్టమైన మరకతమణి సుస్వరాల బాణి శిశిరకాల (దేవరాగం ) https://www.youtube.com/watch?v=TgCHPXxIP9s

బొంబాయి  మ్యూసిక్ థీమ్ + https://www.youtube.com/watch?v=2hVREG9uqrc

https://www.youtube.com/watch?v=iX1OxnyFT4g

https://www.youtube.com/watch?v=wBDPxQXvKEk

.https://www.facebook.com/rajeshcherth...


10, నవంబర్ 2018, శనివారం

కథనం లో ఆమె నవ్వు

కథనం లో  "ఆమె నవ్వు" కథ





 ఎంతో శ్రావ్యంగా ఉంది .. 


కామయ్య తోపు, పోరంకి అన్నపూర్ణ హోటల్,మా బందరు కాలువ, జమలాపురం గుడి మా విజయవాడ నేపథ్యంలో నడిచిన కథ.  ఈ కథ చదివిన తర్వాత కామయ్య తోపు దగ్గర కళ్ళతో టిఫిన్ బండిని వెతుక్కుని ఆమె కనబడటం లేదని అడిగినవాళ్లు వున్నారు. వేలమంది పాఠకులు నాకు కాల్ చేసి అబ్బా .. ఏం వ్రాశారండీ.. అని మెచ్చుకున్న వాళ్ళు వున్నారు. ఇవాళ్టికీ ఈ కథ పై స్పందనలు వస్తూ వుంటాయి. నాకు కూడా యిష్టమైన కథ. నా రెండు కథా సంపుటాలలో యీ కథ వుంది.  

ఇప్పుడీ కథ "కథనం" లో చోటుచేసుకుని నాకు సంతోషాన్నిచ్చింది. భావయుక్తంగా చదవడమే కాదు కథని బట్టి వెనుక నడిచిన నేపథ్య సంగీతం నూనె సుర సురలు పిండి పేలడమూ తో సహా  యెంతో బాగున్నాయి. ధన్యవాదాలు షరీఫ్ గారూ..

మీరూ వినండి ..Like చేయండి Share చేయండి Subscribe చేయండి.