అంజలి పుట్టబోయెడి బుల్లి బుజ్జాయి కోసమై పొదుగు గిన్నెకు పాలు పోసి పో్సి - పుట్టబోయెడి బుల్లి బుజ్జాయి కోసమై పొదుగు గిన్నెకు పాలు పోసి పో్సి - కలికి వెన్నెలలూరు చలువ దోసిళ్ళతో లతలకు మారాకులతికి అతికి - పూల కంచాలలో రోలంబములకు రేపటి భోజనము సిద్ధపరచి, పరచి - తెలవారకుండ మొగ్గలలో జొరబడి వింతవింతల రంగు వేసి వేసి - తీరికే లేని విశ్వసంసారమందు అలసిపోయితివేమొ దేవాధిదేవా! దేవాధిదేవా! ఒక్క నిమేషమ్ము కన్నుమూయుదువు గాని రమ్ము, రమ్ము తెరచితి నా కుటీరమ్ము తలుపు
హృదయ పూజ కూర్చుండ మాయింట కురిచీలు లేవు, నా ప్రణయాంకమే సిద్ధపరచనుంటి; పాద్యమ్ములిడ మాకు పన్నీరు లేదు, నా కన్నీళ్ళతో కాళ్ళు కడుగనుంటి. పూజకై మా వీట పుష్పాలు లేవు, నా ప్రేమాంజలులె సమర్పించనుంటి; నైవేద్యమిడ మాకు నారికేళము లేదు, హృదయమే చేతికందీయనుంటి! లోటు రానీయనున్నంతలోన నీకు, రమ్ము! దయచేయుమాత్మ పీఠమ్ము పైకి, అమృత ఝరి చిందు నీ పదాంకములయందు కోటి స్వర్గాలు మొలిపించుకొనుచు తండ్రీ!
కథా సంపుటి పేరు: చుక్క పొడిచింది. రచయిత: పాలగిరి విశ్వ ప్రసాద్
కథలపై నా చిరు అభిప్రాయం..
డబ్బును జీవన సోపానాలుగా మార్చుకునే వాడికి ప్రేమంటే ఏమిటో ఎప్పటికీ అర్దం కాదు. అది ఉప్మా తినేసి వదిలేసిన కరివేపాకు లాంటిది. ఈ కథ చదివాక అప్రయత్నంగా “చలం” గుర్తొచ్చారు. రచయిత వొప్పుకుంటారో లేదో!
చెప్పుకింద పూలు.. కథలో తరతరాల అణచివేత కనబడినా.. అవి అప్పటి పరిస్తితులు.ఈనాటికి దళితుల ఆలోచనలు ప్రగతి బాట పట్టినట్లు కాస్తంత వారి జీవితాలలో చిరుదీపాలు వెలిగాయనే చెప్పచ్చు. చదువుకున్న యువతలో నాకు ఆనాటి శీనడు కనబడ్డాడు. అయితే కథలో రచయిత ఆశాభావం కనబడలేదు. నిసృహ మాత్రమే కనబడింది. ఈ కథకు మాండలికం ప్రాణం పోసింది.
చుక్క పొడిచింది.. ఈ కథ రాసిన కాలానికి ఈకథ గొప్ప ఆలోచన. ప్యాక్షన్ రాజకీయాల మధ్య వేట కొడవళ్ళకు బాంబులకు బలై పోయిన మగవారి కథ. కానీ భర్తల మరణాన్ని తేలిగ్గా తీసుకోని భార్యల కక్ష కార్పణ్యాల విశ్వరూపం ఎలా వుంటుందో ఆ స్త్రీలు ప్రత్యర్ది వర్గం వారి చావును చూడటం కోసం దేనినైనా ఫణంగా పెడుతూ.. అనుకున్న దానిని సాధించేవరకూ .. ప్రశాంతంగా వుండలేరనే విషయాన్ని చెబుతూనే .. అంతకుముందులాగానే ప్రత్యర్ది దొంగ దెబ్బకు కక్షకు బలైపోయిన తన భర్తఎడబాటును జీర్ణించుకుంటూ ఇంకొక తరం.. అలాంటి కక్షలకూ కార్పణ్యాలకు గురి కాకూడదని వీలైతే కుటుంబం మొత్తాన్ని లేకుంటే తన బిడ్డలను దూరంగా తీసుకొని పోవాలని నిర్ణయించుకున్న సుజాత కథ.. ప్యాక్షన్ రాజకీయ కుటుంబాలలోని స్త్రీల ఆలోచనకు అద్దం పట్టింది. ఈ కథ వచ్చి 22 సంవత్సరాలైంది. ఒక సామాజిక అంశాన్ని సృశించి.. చైతన్యవంతమైన మార్పును కోరుకుంటూ సుజాత పాత్రను తీర్చిదిద్దిన విధానం రచయిత ఆలోచనలనూ ఆరోగ్యకరమైన శాంతియుత జీవన విధానం పట్ల వున్న ఆకాంక్షను తమ ప్రాంతంలో జరిగే విధ్వంస జీవన విధానం పట్ల వెగటును పట్టి ఇచ్చాయి.
ఇంకొక కథ "పాములు " విలాస జీవనానికై నైతిక విలువలను ఫణంగా పెట్టె భార్యాభర్త కథ ... సమాజంలో అంతస్తుల పట్ల పెరుగుతున్న వ్యామోహాన్ని నయా ధనవంతుల మేడిపండు జీవితాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించింది.
ఈ రచయిత ఇకపై సంజాయిషీ చెప్పకుండా మరిన్ని మంచి కథలను అందించాలని కోరుకుంటాను. డిమాండ్ చేస్తున్నాను.
పి.రామకృష్ణారెడ్డి గారు కేతు విశ్వనాథరెడ్డిగారు, బండి నారాయణ స్వామి గారు ఈ కథలకు మంచి కితాబుని ఇచ్చారు.
మిగతా కథలు కూడా చదవాలి. చదవకుండా ఆపలేవు కూడా. ఈ సంపుటిలో మొత్తం పది కథలు ఉన్నాయి. ఏ కథకు ఆ కథ చదవదగిన కథ. గుర్తుండిపోయే కథలు.
ధన్యవాదాలు పాలగిరి విశ్వ ప్రసాద్ గారూ.. మీ కథల సంపుటి అడిగి మరీ తెప్పించుకుని.. ఈ రోజుకు చదవగల్గాను.
కాలానికి ఏదో ఒక పేరుపెట్టుకోవడం ఆనవాయితీ అనుకుంటే నేనొక కాలానికి రేడియో రోజులు అని పేరు పెట్టదలుచుకున్నాను. ఆరేడు దశాబ్దాలు రేడియో వినడం అనేదాన్ని కూడా ఆశ్చర్యంగా చూసిన కాలం దాటి ఇంట్లో రేడియో వుండటమనేది హోదాకి దర్పానికి చిహ్నమై.. తర్వాత తర్వాత సామాన్యుడి ఇంట కూడా.. “బహుజన హితాయా బహుజన సుఃఖాయ” కి నిజమైన అర్దాన్ని ఇచ్చి సమాచార విజ్ఞాన వినోద కార్యక్రమాలను సాహిత్యాన్ని ప్రజల మనసుల్లో ముద్ర వేసుకునేటట్లు శ్రవణపేయంగా అందించిన కాలానికి రేడియో కాలం అని గర్వంగా చెప్పుకోవచ్చు.
ఇపుడంటే ఎపుడు కావాలంటే అపుడు అరనిమిషంలో కావాల్సిన పాటను వినే చూసే అవకాశం వచ్చి అంతే తొందరగా విరక్తి తెచ్చుకునే కాలంలో వున్నాము కానీ..
ఒకప్పుడు ఇష్టమైన పాట వినాలంటే .. ఎంత వేచి చూడాల్సివచ్చేది. చిత్రలహరిలో వేసే పాటలలో మనకిష్టమైన పాట వస్తే ఎంత సంబరం. అనుకోకుండా నాన్న బహుమతి ఇచ్చిన ఆనందం. ఇక 25 పైసల కార్డు కొనుక్కొచ్చి జనరంజని కార్యక్రమానికి కావాల్సిన పాటను కోరుకుంటూ ఉత్తరం రాసిన మూడో నాటి నుండి రేడియోకి చెవులప్పగించి ఎదురుచూడటం అనేది ఎంత మధుర జ్ఞాపకం. ఎపుడో ఒకపుడు మన పేర్లు వినిపిస్తూ మనం కోరిన పాటని వినిపిస్తూ.. వుంటే.. ఆ పాటతో గొంతు కలిపి ఎవరు ఏమనుకుంటారోనన్న బిడియం మరిచి హాయిగా గళం విప్పి గళం కలపడంతో పాటు గబ గబా చేతికందిన పుస్తకంలో పాట సాహిత్యాన్ని బర బరా రాసుకోవడం ఎంత ఆనందం.
అలా సినీ సాహిత్యంలో మునిగి మునిగి ఆలోచనామృతం సాహిత్యం అనుకుంటూ.. డా. సి. నారాయణ రెడ్డి సాహిత్యం పై ఇష్టం పెంచుకుని.. “సిపాయీ.. ఓ సిపాయీ.. నీకై ఎంత ఎంత వేచి చూసాను ఈ వాలు కనుల నడుగు అడుగు ఇకనైనా.. “ అన్న పాటపై ఇష్టాన్ని.. మహ్మద్ రఫీ సుశీలమ్మ గళ మాధుర్యాన్ని సి.రామచంద్రన్ స్వరకల్పననూ వింటూ ఆనందడోలికలపై తేలియాడిన రోజులు.. రేడియో కాలం. .. అంటే అభ్యంతరమా..
సిపాయీ ..ఓ సిపాయీ ... పాట ఇక్కడ చూడండి . మేకప్ ఎక్కువై ఒకింత ఎబ్బెట్టు తప్ప .. బాలకృష్ణ దీప.. 💞 ఇక NTR దర్శకత్వం.. చూడవచ్చు ఇన్నేళ్ళ తర్వాత కూడా విసుగు పుట్టకుండా. 😊