7, జూన్ 2013, శుక్రవారం

"బ్లాగ్ కథలు" గురించి ఒక ఆలోచన

బ్ల్లాగ్ మిత్రులకి నమస్తే ! అందరూ బావున్నారా అండీ !?

అడివరకటి లా రోజూ పొస్ట్ వ్రాయాలనే ఉత్సాహం తగ్గక పోయినా ..ఓ ..నిరాసక్తత  అలముకుంది.   అందుకని  ఎక్కువ బ్లాగులు చదివే  పనిలోనే  ఉన్నాను.

ఏదైనా తక్కువ వ్రాసే పని లోనే ఉన్నాను కదా! !

ముఖ్యంగా నేను వ్రాసిన పోస్ట్ లలో నేను  వ్యాసాలూ మాత్రమే చక్కగా వ్రాయగల్గాను. ఒక కథ, లేదా కవిత తో  అందరిని మెప్పించడం కూడా చాలా కష్టం కూడా . కానీ నేను కథలు వ్రాయడానికే ఎక్కువ ఆసక్తిగా ఉన్నాను.

నేను వ్రాసిన కథలు ఏ పత్రికలకో పంపి ఒక అర్ధ సంవత్సరం పాటు ఎదురుచూస్తూ  అసహనంగా ఉండటం నా వల్ల  కాదు. అందుకే వ్రాసిన వెంటనే ఠపీ మని బ్లాగ్ లో పోస్ట్ చేస్తున్నాను .

ఆ కథలపై స్పందన సరిగా రాకున్నా సరే  .. ఏదో నా తృప్తి  :)

ఈ వారంలో ఒక చిత్రమైన సంగతి గమనించాను . " రాయికి నోరొస్తే !? " కథ పోస్ట్ చేసిన తర్వాత  నాలుగు రోజులకి ఈ రోజు గమనిస్తే .. ఆ కథ కి 1549  వీక్షణలు వచ్చాయి

అలాగే అప్పుడెప్పుడో వ్రాసిన కథ "జాతర " కి 831 వీక్షణలు ఉన్నాయి  ఈ కథని Ashburn Virginia  లో రోజు ఒకరు చదువుతున్నట్లు గమనించాను

బ్లాగులలో వ్రాసిన కథలకి ఎవరు ఎప్పుడూ  వారి వారి కథలకి లభించిన  స్పందనలని చెప్పినట్లు నేను గమనించలేదు

ఈ బ్లాగ్ లో ఉన్న కథలని చాలా మంది చదువుతున్నట్లు నేను గమనిస్తున్నాను . కథ గ్రూప్ లో కూడా బ్లాగ్ కథలని పరిచయం చేస్తున్నారు

నాకు ఒక ఆలోచన తోస్తుంది . ఈ బ్లాగ్ లలో ఈ 2013 లో వ్రాసిన కథలలో ఒక పది లేదా పదిహేను కథలని  ఉత్తమమైనవి ఎంపిక చేయించి "బ్లాగ్ కథలు " అనే కథా సంపుటి వేయిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వస్తుంది

 ఈ ఆలోచన ఎలా ఉంది అంటారు !? ఆసక్తి కల్గిన వారందరూ ఒకసారి కూడి సమాలోచన చేద్దాం .

పత్రికల వారికి పంపి ప్రచురింప బడలేదు ఆన్న బాధ ని ప్రక్కకి పెట్టేసి మన మన బ్లాగ్ ల లోనే కథలు వ్రాసుకుందాం . ఔత్సాహిక రచయితలూ అందరూ .. మంచి మంచి ఇతివృత్తాలతో కథ వ్రాయడం మొదలెట్టండి .

అవకాశాన్ని బట్టి అచ్చు లోనూ ..లేదా డిజిటల్ ప్రచురణ లోను "బాగు కథలు " ని  పరిచయం చేద్దాం

నా ఈ ఆలోచన చెప్పగానే ఓ.. సాహితీ సంస్థ  వారు ఉత్తమ కథలకి మూడింటికి బహుమతులు ఇద్దాం .అని సంతోషంగా ప్రకటించేశారు

ఇంతకూ ముందు "కె ఎన్ మల్లీశ్వరి గారి బ్లాగ్ కథ ల సంపుటి " అలాగే కల్పన రెంటాల గారు  బ్లాగ్ లో సీరియల్ గా వ్రాసిన  "తన్హాయి " నవలగా రావడం చూసాం కదా!

వర్ధమాన రచయిత,రచయిత్రులందరూ  కలసి మనం  కూడా ఒక ప్రయోగం చేద్దాం .. ! పోయేది ఏముంది .. ఒక ప్రయత్నం విజయవంతం లేదా అపజయం .. అంతే కదా !

 ఆసక్తి కల్గిన వారు మీ మీ స్పందనల్ని వ్యాఖ్య ల రూపంలో తెలియజేయండి..సూచనలకి ఆహ్వానం పలుకుతూ


3, జూన్ 2013, సోమవారం

రాయికి నోరొస్తే !?



" అపర్ణా! యెందుకే  బెల్లం కొట్టిన రాయిలా అలా మౌనంగా నిలబడ్డావ్  ? అడిగిన దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం నీకుంది  కదా!  చూసే వాళ్ళు మౌనం అర్దంగీకారం అనుకుంటారు. చెప్పు, సమాధానం చెప్పు,  అడిగినవాడి చెంప చెళ్ళు మనిపించేలా సమాధానం చెప్పాలి . తప్పు చేయనప్పుడు రోషం పొంగుకు రావాలి కానీ అలా కన్నీళ్లు కార్చడం కాదు చేయాల్సింది " కోపంగా చెప్పింది తల్లి పద్మ

అపర్ణ అప్పుడూ యేమీ  మాట్లాడలేదు. అక్కడి నుండి లోపలికెళ్ళిపోయింది .

"దీని  వరుస చూస్తుంటే బాబీ  అన్న మాటలు నిజమే నేమో అనిపిస్తున్నాయి "అన్నాడు తండ్రి విశ్వం

"ఛీ.. ఛీ!  అలాంటి  మాటలనకండి. అది మన బిడ్డ . కలలో కూడా తప్పు చేసే ఆలోచన దానికి రాదు. అసలు తన మనసులో యేముందో మనకి అర్ధం కావాలి కదా ! దాని మనసుని, ఆలోచనలని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం"

"ఇది ఇలా నోరు విప్పకుండా మొండి పట్టు పట్టుకుని కూర్చుంటే రేపు వాళ్ళకి యేమని సమాధానం చెప్పగలం? " విసుకున్నాడు

"అవతల వాళ్ళు అడిగినట్లు మనమూ అడిగి తన మనసుని బాధపెట్టవద్దు. అదసలే సున్నిత మనస్కురాలు,  ఇన్నేళ్ళుగా యీ అనుమానపు చూపులు యెదుర్కొంటూ  అవమానపడుతూ యెలా బ్రతికిందో  నా బిడ్డ . వాడికి అసలు ఆ మాటనడానికి నోరెలా వచ్చిందో !? "గొంతులో దుఃఖం అడ్డుపడుతూ వుండగా యింకా యేదో అనాలనుకుని కూడా అనలేక  ఆపేసింది.

"ఇద్దరూ చిన్నప్పటి నుండి కలసి పెరిగినవారే కదా! అపర్ణ గురించి వాడికి మాత్రం తెలియదూ ! ఇద్దరూ ప్రేమించుకుని యిష్టపడే కదా పెళ్లి చేసుకున్నారు . ఇపుడు యీ అనుమానాలు యేమిటో?   బయటకి పొక్కి నలుగురికి తెలిస్తే మనం తలెత్తుకుని తిరగ గలమా? ఆవేదనగా అన్నాడు విశ్వం
కాసేపు ఇద్దరూ మౌనంగా ఉండి పోయారు

"వదినా భోజనాలు అయ్యాయా? " అంటూ గోడవతలి నుండి పలకరించింది పద్మకి ఆడపడుచు అపర్ణకి  అత్త గారైన విజయ.

“లేదొదినా, యిప్పడు చెయ్యాలి” అంటూ లోపలి రాబోయింది. "వదినా ! వొక చిన్న మాట. యిలా వచ్చి విని పో "  అంది. తప్పదన్నట్లుగా రెండిళ్ళ మధ్య వున్న గోడ దగ్గరికి వెళ్ళింది .

 "ఏమంటుంది అపర్ణ " యే సంగతి చెపితేనే కదా ! రేపు టెస్ట్ లకి వెళ్ళగలరు. ఎక్కువ సెలవలు కూడా లేవయ్యే! మళ్ళీ తిరిగి  వెళ్ళిపోవాలి కదా" అంది

వెర్రి మొర్రి ఆలోచనలతో జీవితాలకే సెలవు చెప్పుకునే పరిస్థితి తెచ్చింది నీ కొడుకు, యిక నా కూతురిని యే౦  చెప్పమంటావు ? మీకేమైనా  చేతనైతే మీ  కొడుకుకే కాస్త గడ్డి పెట్టండి " అంటూ అక్కడి నుండి విసురుగా వచ్చేసింది

లోపలి వచ్చి చూస్తే పిల్లలిద్దరినీ కూర్చోపెట్టుకుని అన్నం తినిపిస్తున్న అపర్ణ కనిపించింది. పోన్లే! కూతురైనా యే ఆలోచన లేకుండా పిల్లలతో స్థిమితంగా కనబడింది అనుకుంది

అపర్ణ పిల్లలు లిద్దరిని నిద్ర పుచ్చి వచ్చే దాకా వుండి ముగ్గురు కలసి అన్యమనస్కంగానే భోజనాలు ముగించారు.
గదిలోకి వెళ్ళబోతూ ఆగిన అపర్ణ "అమ్మా!  రేపు పిల్లలిద్దరినీ  DNA టెస్ట్ కి తీసుకుని వస్తామని వాళ్ళకి  చెప్పమ్మా " అని చెప్పి లోపలి వెళ్లి తలుపేసుకుంది.

ఆ మాట విన్న అపర్ణ తండ్రి నిశ్చింత గా పడుకున్నాడు . తల్లి పద్మకి దుఖం పోర్లుకొస్తుంది
భర్త వైపుకి తిరిగి యిప్పుడైనా మన బిడ్డని నమ్ముతారా? అంది .

"ఇక్కడ నమ్మడం నమ్మక పోవడమన్నది సమస్య కాదు పద్మా, యెవరికైనా తల్లి నిజం తండ్రి నమ్మకం.  ఆ నమ్మకమే ప్రశ్నార్ధకం అయి కూర్చుంటే దానికి నిరూపణ చేయాల్సి రావడం ఆ తల్లికి  కష్టమే?  కానీ తప్పదు, నమ్మకం లేనివాడు నా మేనల్లుడు, అల్లుడు కావచ్చు అవమాన పడుతుంది నా కూతురు కావచ్చు. ముద్దాయి స్థానంలో మన అమ్మాయి నిలబడి వుంది కాబట్టి నిరూపించుకోవాల్సిన అవసరం మనకి వుంది కదా! అందుకు అపర్ణ వొప్పుకున్నందుకు బరువు తీరినట్లు వుంది" అన్నాడు

మీరు యెన్నయినా చెప్పండి, ఒక తల్లిగా కన్నా వొక స్త్రీగా నేను యీ విషయాన్ని అంత  తేలికగా తీసుకోలేకపోతున్నాను.  మగవాడు తన బిడ్డలని చూసిన ప్రతి క్షణం వీళ్ళు నాకే పుట్టారా ? లేక యెవరికైనా పుట్టి వుంటారా నన్న అనుమానంతో చూడటం మొదలైతే ఆ బిడ్డలని ఆతను మనఃస్పూర్తిగా ప్రేమించగలడా?  ఆ భార్యని విశ్వసించగలడా ?  అపర్ణ మాత్రం క్షణ క్షణం  అలా అవమానింపబడటాన్ని యెలా తట్టుకోగలదు ? అంత  కన్నా నరకం మరొకటి వుంటుందంటారా? అడిగింది

"జీవితం అంటే నమ్మకం పద్మా! ఆ నమ్మకం లేనప్పుడు కొన్ని జీవితాలు ఇలాగే ఉంటాయి"  భారంగా చెప్పాడు
 పద్మకి  అప్పుడెప్పుడో చూసిన  "అస్తిత్వ్ " చిత్రం గుర్తుకు వచ్చింది. ఆ చిత్రం లో  "అదితి " లాగా తన కూతురు భర్త యెడబాటుతో పరాయి పురుషుడికి సన్నిహితమయిందేమో అన్న అనుమానం కల్గింది. కానీ అలాంటి అనుమానాలన్ని పఠాపంచలు  అయిపోయాయి.  మరునాడు జరగబోయే విషమ పరీక్ష గురించి వారికి యెలాంటి సందేహం లేదు . అపర్ణ నడవడిక మంచిది కానట్లయితే భర్త బాబీ అనుమానం నిజమైన పక్షంలో ఆమె టెస్ట్ లకి వొప్పుకునేదే కాదు   అపర్ణ యీ విషయాన్ని ముందు అవమానంగా తీసుకుంది తర్వాత యేడ్చింది, ఆ తర్వాత మౌనం వహించింది. కొంత ఆలోచన తర్వాత   ఆఖరికి నిరూపణకి వొప్పుకుంది కానీ తర్వాత భర్త తో కలసి వుండగలదా ?  కూతురి మనస్తత్వం తెలిసిన పద్మ మనసులో అనేక ఆందోళనలతో తెల్లారిపోయింది

అపర్ణని,  పిల్లలిద్దరినీ తీసుకుని పద్మ, విశ్వం కారు ఎక్కి కూర్చున్నారు  "ఎక్కడికి వెళదామంటారు బావా " అడి గాడు  విశ్వం .

 బాబీ తండ్రి "వాడు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళాలి కదా బావా అని విసుక్కుంటూ "ఎక్కడికి వెళ్ళాలి రా ?" అని అడిగాడు. ఒక పెద్ద కార్పోరేట్ హాస్పిటల్ పేరు చెప్పి అక్కడ డాక్టర్ గా పనిచేస్తున్న వొకతని పేరు చెప్పి అతనిని కలిస్తే అవసరమైన పరీక్షలు చేస్తారని చెప్పాడు

ఆ విషయం చెపుతున్న బాబీ  వైపు అభావంగా చూసింది అపర్ణ. రెండు కార్లలోను రెండు కుంటుంబాల వారు కలసి  ఆ హాస్పిటల్ కి వెళ్ళారు

DNA టెస్ట్ అంటే ఏమిటో, పిల్లలని టెస్ట్ ల పేరిట యెన్ని సూదులు పొడిచి నమూనాలు సేకరిస్తారో ?పాపం,పుణ్యం  యేమి యెరుగని అమాయకపు పిల్లలెలా తట్టుకుంటారో ఆని భయపడిపోయింది పద్మ .అవన్నీ యేమి లేకుండానే పిల్లలని యేమి హింస పెట్టకుండానే వొక గంట లోపే పిల్లలిద్దరికీ పరీక్షలు నిర్వహించి పంపేసారు.

వచ్చేటప్పుడు  అపర్ణ వాళ్ళతో పాటు కారెక్కిన విజయ. యింటి ముందు కారాగగానే దిగి అపర్ణ ప్రక్కకి వచ్చి .. "నువ్వు కాస్త పద్దతిగా, విరగబాటు లేకుండా వుండి  వుంటే  ఈ పరీక్షల తంతు వుండేది కాదు కదా ఆడవాళ్ళు యెంత చదువుకున్నా, వుద్యోగాలు చేసినా, వూళ్ళేలినా  మగవాడితో పోటీ పడరాదే అంటే వూరుకోలేదు. వాడితో సమానంగా వుద్యోగాలు  చేయాలి అన్నావ్?  ఇద్దరూ వేరు వేరు వూర్లలో వుద్యోగం చేయడం , నెలల తరబడి ఆపీస్ పనులపై టూర్ లెళ్ళీ  ఆ పై బిడ్డలని కంటే మగవాడికి నమ్మకం కుదరొద్దు . ఏ వూరి ఆంబోతు అయితే మాకేమిటి,మా దొడ్లో ఈనితే చాలనుకుంటానికి యిదేమన్నా పశువుల కొట్టమా !? వంశం ,ఆచారం, పోలికలు యెన్ని వుండాలి ! అవన్నీ వుంటే  వాడెందుకు అనుమానపడతాడు " అంటూ  అనాల్సిన నాలుగు మాటలు అనేసింది

అపర్ణ యిప్పుడూ  యేమి మాట్లాడలేదు.  అక్కడి నుండి మౌనంగా లోపలి  వెళ్ళిపోయింది

మరో నాలుగు రోజుల తర్వాత  విశ్వం యింటి ముందు పదిమంది పెద్దలు కూర్చుని పంచాయితీ మాదిరిగా మాట్లాడుకుంటున్నారు

"మీరైనా చెప్పండి అన్నయ్యా ! మా అన్న విశ్వానికి  మా వదినకి వెరుపు అనేది లేకుండా పోయింది కూతురేమంటే దానికి తందానా అంటూ తలూపుతున్నారు.  దాన్ని కాస్త మందలించి కాపురం నిలబెట్టవద్దూ ! జరిగి పోయిందేదో  జరిగి పోయింది, పిల్లలిద్దరూ వాడి బిడ్డలే అని తెలిసిన తర్వాత బాబీ బాగానే వున్నాడుగా, పెళ్ళాం మాట్లాడకపోయినా బిడ్డలిద్దరినీ యెత్తుకుని మురిపెంగా  చూసుకుంటున్నాడు కదా! వెళ్ళేరోజు దగ్గరబడుతుంది అన్నీ సర్దుకోమని చెప్పడానికి వెళ్ళాడు . ఇకపై వుద్యోగం చేయాల్సిన పని లేదు, యింట్లో వుండి  పిల్లలని చూసుకుంటే చాలని చెప్పాడు. ఆ మాటకి శివంగిలా విరుచుకు పడి వాడిని బయటకి నెట్టేసింది. ఆడడానికే అంత  పొగరుంటే మగాడు నా కొడుకుకి యెంత  పొగరు వుండాలి " అంటూ పెద్ద పెద్దగా మాట్లాడ సాగింది.

నువ్వేమంటావ్ విశ్వం ? అడిగారు పెద్దమనుషులు

"నేనేమంటాను బాబాయ్! అపర్ణ చిన్న పిల్లేం కాదు కదా! తన నిర్ణయానికి తనని వదిలేద్దాం అనుకుంటున్నాను ".
"ఇద్దరికీ కావాల్సిన వాడిగా నేను చెపుతున్నాను జరిగిందేదో జరిగిపోయింది . వాడు  వెదవ ఆలోచనలే చేసాడు . సీతమ్మ వారిలా అపర్ణ అగ్ని పరీక్షనే యెదుర్కొంది  కాదనను, కానీ కొంచెం సర్డుకుంటే  కాపురం నిలబడుతుంది . పైగా మీరేమి పరాయి వాళ్ళు కాదు. అన్నా-చెల్లెళ్ళ మధ్య యేమి జరిగినా తప్పు యెవరిదయినా సర్డుకుంటే తప్పేమీ లేదు  అందులో ప్రక్క ప్రక్క యిళ్ళలోనే వున్నారు తెల్లారి లేచింది మొదలు వొకళ్ళ ముఖాలు వొకళ్ళు చూసుకోవాలి " సర్ధి చెప్పే ప్రయత్నం చేసారు బాబాయ్.

విశ్వం భార్య పద్మ వైపు చూసాడు. అది అర్ధం చేసుకున్న ఆమె  లోపలికెళ్ళి అపర్ణ ని పిలుచుకుని వచ్చింది
"ఏమ్మా  అపర్ణా! బాబీ పిలుస్తున్నాడు కదా పిల్లలని తీసుకుని వాడితో  వెళ్ళమ్మా " అనునయంగా చెప్పాడు

"నాకు విడాకులు కావాలి తాతయ్యా" కుండ బ్రద్దలు కొట్టినట్లు చెప్పింది.

ఆ మాట వినగానే కూర్చున్న కుర్చీలో నుండి లేచి కుర్చీ విసిరి కొట్టాడు బాబీ."ఏమిటి  ఎక్స్ ట్రా వేషాలు వేస్తున్నావ్ ? టెస్ట్ రిజల్ట్స్ రాగానే పెద్ద ప్రతివత నయిపోయాననుకున్నావా ? నీ వేషాలు నాకు తెలియదు అనుకున్నావా? అందరి ముందు నంగనాచిలా వేషాలు వేయకు,లగేజ్ సర్దు రేపే ప్రయాణం " అన్నాడు

"నాకు విడాకులు కావాలి " మళ్ళీ అదే  స్తిరమైన మాట అపర్ణ నోటి వెంట.

నీకు విడాకులు కావాలి  అంటున్నావ్ ! అందుకు కారణం ఉండాలి కదా అడిగాడు తాతయ్య
"తాతయ్యా నీకు ఐదుగురు పిల్లలు  వున్నారు, నువ్వెప్పుడైనా మా అమ్మమ్మని వీడు నాకే పుట్టాడా అని అడిగావా ? " అని అడిగింది

"ఛీ ఛీ అదేం మాటమ్మా తాళి గట్టిన భార్యని బ్రతుకంతా నాతోనే అరగదీసుకుందామని  వచ్చినామెని అలా అనుమానం గా చూడగలనా? తప్పు అలా మాట్లాడకు " అన్నాడు చప్పున.

"అత్తా ! మీకు పిల్లలు పుట్టడం ఆలస్యం అయిందని మామయ్యా లేకుండా నువ్వు సేవల కోసమని  ఆశ్రమాలకి ఇంకా అప్పుడప్పుడు గురు పీఠాలకి వెళ్లి ఇరవై రోజులు  పాటు ఉండేదానివి కదా! ఆ తర్వాత యెన్నేళ్ళకో బావ పుట్టాడు . అప్పుడు వీడు నాకే పుట్టాడా అని మామయ్యా నిన్ను అడిగాడా? " అడిగింది .

" ఏంటే ! నోటికి యెంతొస్తే అంత మాట్లాడుతున్నావ్ ? చెప్పు తీసుకుని కొడితే పళ్ళు రాలతాయి జాగ్రత్త " అని  అపర్ణ ని కొట్టడానికన్నట్లే  వొక్క వుదుటున లేచింది విజయ

"నేను మాటవరసకి అడిగిన మాటలకే  మీరు యింత నొచ్చుకుంటే ఆరు సంవత్సరాల పాటు అనేక అనుమానాలు వున్న యితనితో కాపురం చేసినందుకు నేనేమనాలి. ఇద్దరం ఒకేరకం చదువు చదివాం,  ప్రేమించుకున్నాం, యిద్దరి వైపు  పెద్దవాళ్ళు వొప్పుకుని రంగ రంగ వైభవంగా పెళ్లి చేసారు, ఇద్దరూ అవకాశాలు దొరక బుచ్చుకుని విదేశంలో వుద్యోగం చేసుకుంటున్నాం,  కొన్నేళ్ళు చెరొక చోట వున్నంత మాత్రాన నన్ను అనుమానించాలా ? నాకు పుట్టిన పిల్లలకి తండ్రి అతనేనా  అన్నది సందేహమే! బిడ్డలని యెత్తుకున్న ప్రతిసారి వాళ్ళ వైపు అనుమానంగా చూస్తాడు, వాళ్ళని వున్నట్లు వుండి  బంతిని విసిరినట్లు విసిరి కొట్టి వెళ్ళిపోతాడు,తోటి  ఉద్యోగితో మాట్లాడినా తప్పే! వాడేనా నీ రహస్య స్నేహితుడు అంటాడు, సంవత్సరాల తరబడి మౌనంగా అతని అనుమానాలని  భరించాను, అవమానాల్ని యెదుర్కొన్నాను తాతయ్యా.  ఇప్పుడు నిజం నిరూపించుకున్నా సరే అతనితో కలసి నేనుండలేను” ఖచ్చితంగానే చెప్పింది.

నువ్వు చెప్పింది నిజమే ననుకో, యేదో తప్పు జరిగిపోయింది. నువ్వు కాస్త సర్దుకుంటే బావుంటుందని .

"తర తరాలుగా, యుగ యుగాలుగా ఆడదానికి యీ శీల పరీక్షలు, అవమానాలు వుండాల్సినదేనా !? మనం నేర్చిన నాగరికత ఇదేనా! మనిషి పై నమ్మకం లేనప్పుడు ఆ మనిషికి పుట్టిన బిడ్డలని తన బిడ్డలా కాదా అని అనుమానంతో చూసేటప్పుడు  ఆ బంధానికి  వున్న విలువ యేపాటిదన్నది ప్రశ్నించుకుంటే చాలు సమాధానం దొరుకుతుంది . ఇక్కడ యెవరి సంస్కారం యే  పాటిదో  మీఅందరికి  తెలియడం లేదా ? నేనెందుకు అతనితో కలసి వుండాలో చెప్పండి ?

"బిడ్డలున్నారు కదమ్మా ! వారి కోసం అన్నీ భరించాలి,నీ వొక్కదానికే   కొత్తగా కష్టాలు వచ్చాయా?  ఇలాంటివి చాలా విన్నాం . తర్వాతర్వాత అవే సర్దుకుంటాయి " రాజీ దోరణిలో చెప్పింది విజయ

నిజమే అత్తా! అందరికి యెన్నో కష్టాలు వస్తాయి. వాటిని యెదుర్కోవాలి కాదనను. ఇలాంటి అవమానకరమైన ప్రశ్నతో నన్ను నేను యెలా సముదాయించుకోవాలో  చెప్పండి ? ఆడవాళ్ళు మగవారితో సమానంగా చదువుతున్నారు, వుద్యోగాలు చేస్తున్నారు.  ఇద్దరూ కలసి వుండే అవకాశం  లేక భర్త వేరొక చోట వున్నంత మాత్రానా అతను  వేరొక స్త్రీ తో సంబంధం పెట్టుకున్నాడని,  బిడ్డలని కన్నాడని నేను అనుమానించానా ? కానీ  ఆతను అదే చేసాడు. ఆతను అలా చేసాడు కాబట్టీ నేను  కూడా అలాగే చేస్తాననుకుంటున్నాడు.  అంతెందుకు అంతరిక్షంలోకి కల్పనా చావ్లా , సునీత విలియమ్స్ పురుషులతో కలసి  వెళ్ళ లేదా వుండ లేదా ! వారిని అనుమానించ గలమా? ఆ ఆలోచన మనకెవరికైనా వస్తుందా ?  కానీ వారిని కూడా అవమానకరంగా మాట్లాడే  భయంకరమైన మనస్తత్వం కల యిలాంటి వాడితో కలసి వుండటం నాకిష్టం లేదు" ఖరాఖండిగా చెప్పింది

"ఓ యబ్బా తెగ ఉపన్యాసాలు చెపుతున్నావ్ కదే! నా కొడుకు వద్దనుకున్నప్పుడు నా కొడుకుకి పుట్టిన బిడ్డలు నీ దగ్గర ఎందుకే ? నా మనుమల్లిద్దరినీ  యిచ్చేయి " అంటూ పిల్లల్ని తీసుకోబోయాడు అపర్ణ మామగారు

"నా పిల్లల మీద చెయ్యేస్తే మర్యాద దక్కదు, నరికి పారేస్తాను . DNA  టెస్ట్ లు చేయక పొతే   వీళ్ళు నీ కొడుకు కే  పుట్టారని నేను చెపితేనే కదా తెలిసేది " అంది ఉగ్రకాళిలా మారి.

"ఈ పిల్ల హద్దు అదుపు లేకుండా మాట్లాడుతుంది వీళ్ళకి మనం చెప్పలేం, మన దారిన మనం పోదాం పదండి వాళ్ళు వాళ్ళే తేల్చుకుంటారు" అని లేచి పోబోతున్నారు పెద్ద మనుషులు

"న్యాయం చెప్పడానికి వచ్చిన పెద్దల్లారా ! నా యీ  వొక్క మాట వినిపోండి,  నాకిన్ని మాటలు చెప్పారు కదా ! నేను చెప్పే   వొకే వొక్క మాట  విని ఆ మాటల గురించి ఆలొచించండి." అడిగింది

అందరూ అపర్ణ  యేమి చెపుతుందా అన్న ఆసక్తితో  వినడానికి నిలబడి వుండిపోయారు

" అలాగే  ఈ బిడ్డలకి తండ్రి యెవరు ? అని అని నన్ను గ్రుచ్చి గ్రుచ్చి ప్రశ్నించిన  భర్త గారు, అత్తగారు  నా మాటకి సమాధానం చెప్పి వెళ్ళాలి " పంతంగా అన్నట్లు అడిగింది.

"ఇది అన్నీ ఇడిచేసి రోడ్డుకెక్కింది. దీనితో మనకెందుకు ? నాలుగునెలలు తిరిగేలోగా దీన్ని మించిన దాన్ని తెచ్చి నీకు పెళ్ళి  చేస్తాను పోదాం పదరా అని కొడుకుని లాక్కేళుతున్న మామగారి ముందుకి వెళ్లి అడ్డంగా నిలబడి 

"ఆడవాళ్ళు తరతరాలుగా నోరు విప్పి ప్రశ్నించకుండా బండ రాళ్ళలా పడి వుంటున్నారు కదా అని యిష్టమొచ్చినట్లు మాట్లాడవద్దు. మీ దౌష్ట్యాలన్ని  యె౦డగట్టే రోజొకటి వుంటుందని తెలుసుకుంటే మంచిది. రాళ్ళకి నోరొస్తుంది. పెదవి విప్పని యె౦తోమంది  ఆడవాళ్ళు దగ్గర  మీ మీ నిజాయితీలు భద్రంగా దాగున్నాయి మామయ్యా !   మీ వంశ వృక్షం యిక్కడ వూరి చివర  వాడలలోను, యిళ్ళ మధ్యనూ, విదేశాలలోనూ కూడా  వున్నారు, వారిని తెచ్చుని భద్రంగా యింట్లో పెట్టుకుని మీ గౌరవాన్ని,  మీ  పురుష అహంకారాన్ని  భద్రంగా కాపాడుకోండి. ఇకపై కోర్టులో కలుసుకుందాం అంటూ లోపలికి నడిచింది.

అమ్మమ్మ తాతయ్యలని అంటిపెట్టుకుని జరుగుతున్న గొడవేమిటో తెలియని పసివాళ్ళ వద్దకి వెళ్ళి  వారిని  దగ్గరగా తీసుకుని తన డొక్కలోకి  పొదువుకుంది.







31, మే 2013, శుక్రవారం

"కాలాతీత వ్యక్తులు" లో " ఇందిర"

కాలాతీత వ్యక్తులు  సమీక్ష




ఆకాశవాణి విజయవాడ కేంద్రం శతవసంత  సాహితీ మంజీరాలు కార్యక్రమం లో " కాలాతీత వ్యక్తులు " నవల ని ప్రసారం చేసినప్పుడు "ఇందిర" గురించి విన్నాను.  చాలా ఆసక్తిగా అనిపించింది.  

చాలా కాలం తర్వాత    మళ్ళీ కొన్ని నెలల క్రితం "కాలాతీత వ్యక్తులు " లో  కథా నాయిక ఎవరు అన్న సాహితీ వ్యాసం  (ఆంధ్రజ్యోతి - వివిధ - శ్రీ వల్లీ రాధిక ) చదివాను.

ఇటీవల  "కాలాతీతవ్యక్తులు" నవలని కొని చదవడం మొదలెట్టాను ఏకబిగిన చదివింప జేసిన ఈ నవల లోని పాత్ర లన్నింటి లోకి నన్నుఆకర్షించిన  పాత్ర "ఇందిర "

ఇందిర గురించి ఈ పరిచయం..

స్వాతంత్ర్యానంతరం వచ్చిన నవల లన్నింటిలోనూ కొన్ని నవలలను పంచకావ్యాల వంటివని సాహితీ కారులు పేర్కొన్నారు అందులో "కాలాతీత వ్యక్తులు " నవల ఒకటి .
ఈ నవలా రచయిత్రి డా ॥ పి.శ్రీదేవి.
మనకి స్వాతంత్ర్యం వచ్చిన పదేళ్ళకి వ్రాయబడిన సీరియల్ ఇది "తెలుగు స్వతంత్ర" లో 21 వారాల పాటు దారావాహికంగా వచ్చిన నవల ఇది. అప్పుడు గోరా శాస్త్రి గారు ఆ పత్రికకి సంపాదకులుగా ఉన్నారు
.
దేశ స్వాతంత్ర్యానంతరం పాశ్యాత్య నాగరికత ప్రభావంతో స్త్రీలలో వచ్చిన మార్పులకి, వారి ఆలోచన విధానంకి మధ్య తరగతి మనుషుల మనస్తత్వానికి ఈ నవల అద్దం పట్టింది
విశేషం ఏమిటంటే ఇప్పటి కాలానికి కూడా ఇందిర పాత్ర లాంటి స్త్రీలని మనం వ్యతిరేకిస్తూనే ఉండటం.

ఏబది అయిదు సంవత్సరాల క్రితం డా ॥ పి శ్రీదేవి గారు వ్రాసిన ఈ నవలలోని "ఇందిర" పాత్ర ఇప్పటి కాలంలోని చాలా మంది స్త్రీ పాత్రలకీ దర్పణం. స్త్రీ స్వతంత్రంగా ఆలోచించడం,సమాజం ఏమి అనుకున్నా పట్టించుకోకుండా తను బ్రతకాలి అనుకున్నట్లు బ్రతికీ తీరడం, తనదైన వ్యక్తిత్వం కల్గి ఉండటం, దానికి కాపాడుకోవాలని ప్రయత్నించడం ఇవన్నీ ఆ నవలలో గోచరిస్తాయి.

అసలు కాలాతీత వ్యక్తులు నవలలో ప్రధాన పాత్రధారిణి అనే విషయం పై కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

"కల్యాణి" పాత్ర ఆ నవలలో మరొక ముఖ్య పాత్ర.

ఈ నవలలోని పాత్ర లన్నింటి కంటే ఇందిర పాత్ర పాఠకులని ఆకర్షిస్తుంది నవలలోని మిగతా పాత్రలన్నీ కూడా ఆమె చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. అసలు ఈ పాత్ర లేకుంటే ఈ నవల ఇంత ప్రసిద్ది చెంది ఉండేది కాదు .

చాలా మంది కాలానికి అనుగుణంగా కాలగమనంలో ఒదిగిపోయి కాల ప్రవాహంలో కలసి పొతారు. కానీ ఇందిర అలాంటి వ్యక్తి కాదు. చిన్నతనంలోనే తల్లి మరణించినా తండ్రి దురలవాట్లు, భాద్యతా రాహిత్యం మధ్య స్వశక్తితో చదువుకుని ఉద్యోగం సంపాదించుకుంటుంది. చాలీ చాలని జీతం మధ్య అన్ని అవసరాలు తీరక పోవడం, తండ్రిని కూడా తానే పోషించాల్సి రావడం వల్ల కొన్ని సాంఘిక కట్టుబాట్లుని, లోక మర్యాదలని ఎదిరించింది. తనకి నచ్చిన రీతిలో హాయిగా జీవించడం నేర్చుకుంది. ఒక విధంగా కాలానికి లొంగకుండా తనకి ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా చలించకుండా మనిషి కృంగకుండా వాటిని ఎదిరించి అవసరం అయితే ఇతరులని మోసం చేయడం, వారిని నిర్దాక్షిణ్యంగా ప్రక్కకి నెట్టించి పరిస్థితులని తనకి అనుకూలంగా మార్చుకుంటుంది.

అందుకే ఇందిర పాత్ర చాలా మందికి నచ్చకపోవచ్చు కానీ ఈ నవలలో ప్రధాన పాత్ర ఇందిర. కాలాతీత వ్యక్తిగా కూడా ఆమెనే పేర్కొనవచ్చు. ప్రకాశంతో స్నేహం చేస్తుంది, షికారుగా అతనితో బీచ్ కి వెళుతుంది. ప్రకాశం స్నేహితుడు కృష్ణమూర్తి తో సెకండ్ షో సినిమాకి వెళుతుంది. తన సరదాలు,అవసరాలు తీర్చుకోవడం కోసం వారితో చనువుగాను మెలుగుతుంది. పక్షి లా ఎగిరి పోయే స్వేచ్చ కావాలని తనకి ఆ స్వేచ్చ ఉనప్పటికి తన రెక్కలు పేదరికం అనే తడితో బరువెక్కి ఎగరలేకపోతున్నానని చెప్పుకుంటుంది.

తాను ఉంటున్న ఇంటి పై భాగంలో అద్దెకి ఉంటున్న ప్రకాశం తనతో పాటు తన గదిలో పేయింగ్ గెస్ట్ గా ఉంటూ కాలేజ్ లో ఆన్సర్ చదువుకుంటున్న కల్యాణిల మధ్య చనువు పెరగడాన్ని గమనించిన ఇందిర ఈర్ష్య పడుతుంది. మగవారి దగ్గర కష్టాలు అన్నీ ఏకరువు పెట్టి సానుభూతి సంపాదించుకోవడం చేస్తుంది కల్యాణి అనుకుంటుంది.

ఇందిర పాత్ర ముక్కు సూటి దనం ఇలా ఉంటుంది.

"ఏమిటి ఆలోచిస్తున్నావ్" ప్రకాశం అని అడుగుతుంది ఇందిర
కల్యాణి గురించి అంటాడతను.

"అస్తమాను కల్యాణి కల్యాణి అంటావ్? నా గురించి ఆలోచించు, నేను అంత కన్నా ఎక్కువ బరువు ఈడ్చుకోస్తున్నాను, నా చదువుని మధ్యలో వదిలేసి ఉద్యోగం వెతుక్కోవలసి వస్తుంది. నాన్న సంగతి నీకు తెలుసు, అయినా గడియ గడియకు కాళ్ళు జాపి కూర్చుని ఏడవడం నాకు చేత కాదు, విశాలమైన కళ్ళు తిప్పి వల వలా ఏడ్చే స్తే నీ లాంటి జాలి గుండె కల మగ వాళ్ళు ఆదుకుంటారు. వాళ్లతో నేను కాలక్షేపం చేయలేను ఆమెలా జాలిగా కళ్ళు తిప్పడం నాకు చేత గాదు అంత నంగ నాచి తనం నాకు లేదు. నా బరువుతో ఇంకొకరి పై ఒదిగిపోయి కాలక్షేపం చేద్దామన్న దురాశ నాకు లేదు నేను బలపడి ఇంకొకరికి బలమివ్వాలనే తత్త్వం నాది " అంటుంది.

ఇందిర గురించి చదువుతున్నప్పుడు ఆ పాత్రపై అయిష్టం కల్గుతూ ఉంటుంది ఆమెలో ఈర్ష్య ని గమనిస్తాం ప్రకాశం కల్యాణి కి ఆకర్షితుదవుతున్నాడని తెలుసుకుని అతనిని తనవైపు మళ్ళించు కుంటుంది. పైగా కల్యాణి పై దుష్ప్రచారం చేసి ఆమె తన దారికి అడ్డురాకుండా చేసుకుంటుంది. అలాగే వసుంధర కృష్ణ మూర్తి పై ఇష్టాన్ని పెంచుకుంటుందని గమనించి అతనిని తెలివిగా తను దక్కించుకుంటుంది.

తనకి కావాల్సినదానిని బలవంతంగా అయినా దక్కించుకునే మనస్తత్వం ఆమెది.

ప్రపంచంలో ఒకరి కోసం ఒకరు ఏదీ చేయరు ఎవరి కోసం వాళ్ళే చేసుకుంటారు .. అది నాకు చేతనవును అనుకునే వ్యక్తి ఇందిర.

ప్రకాశం మేనమామ కుదిర్చిన పెళ్లి సంబంధాన్ని వదులుకుని ఆమె కోసం వచ్చినప్పుడు అతనిని తిరస్కరిస్తూ ఇలా అంటుంది.

"సాధారణంగా పిల్లలకి తల్లి దండ్రులు గార్డియన్ లాగా ఉంటారు నా దగ్గరకి వచ్చేసరికి తల్లక్రిండులై నేనే నాన్నకి గార్డియన్ కావాల్సి వచ్చింది ఆడదాని మనసు నీకు తెలియదు ప్రకాశం ! నేను నీకు ఉన్నాను ..నీ సమస్యలు,నీ బరువులు అన్నీ నా మీద వేయి అనగల్గే మగవాడు అవసరమైతే నా కోసం అన్నీ వదిలేసే మొగవాడు కావాలి, ప్రేమ కోరిన త్యాగం చేయలేనివాడు ప్రేమకి అనర్హులు. నీ మీద నేను చాలా మమకారం పెంచుకున్నాను నువ్వొక వెన్నుముక లేని మనిషివని నాకు తెలుసు. తోమగా తోమగా కొంత గట్టిపడతావు అనుకున్నాను. కొన్ని అనుభవాల తర్వాత అయినా ఒక మనిషిలా ప్రవర్తిస్తావనుకున్నాను. పుట్టుక నుండే నువ్వో సగం మనిషివి బీటలు వారిన వ్యక్తిత్వం. బాగు చేయాలని ప్రయత్నించాను కానీ అది నావల్ల కాదు.నీకు నాకు కుదరదు " అని నిర్మొహమాటంగా చెపుతుంది.

ఇదంతా చదువుతున్న పాఠకుడికి ఆమె పాత్ర పట్ల సరి అయిన అభిప్రాయమే కలుగదు. ఇందిర కొలీగ్ వైదేహి అన్నదమ్ములు ఆమెకి ఇష్టం లేని వాడిని చేసుకోమని బలవంతం చేస్తుంటే ఇల్లు విడిచి వచ్చేసి ఇందిర ఇంట్లో ఉంటుంది .. ఆమె ఇందిరతో ఇలా అంటుంది అమ్మాయిలు యాబై సార్లు సంతలో పశువుల బేరంలా నన్ను కూర్చోబెట్టి మాట్లాడటం నాకు ఇష్టం లేదు అంటే ఇందిర ఇలా అంటుంది . పశువు కాకపొతే మరో నందికేశుడు, జీవితమే పశువుల సంతలా అయినప్పుడు అమాయకంగా సుమతీ శతకంలో నీతులన్నీ వల్లే వేస్తే మనలని వెనక్కి నెట్టడం ఖాయం ఎలాగోలా తీర్ధంలో జనాన్ని మోచేతులతో నెట్టుకుని ముందుకు వెళ్ళడమే అంటుంది.

కావాలని కృష్ణ మూర్తికి దగ్గరవుతుంది తన జీవితం సుఖంగా సాగి పోవాలి అంటే కృష్ణ మూర్తి లాంటి వాడే తగిన వ్యక్తి అనుకుంటుంది అతనికి తగిన చదువు సంధ్యలు లేకపోయినా వెనుక ఉన్న ఆస్తిపాస్తులు ఉండటమే కాదు ఆ అస్తిపాస్తులే అతనిని నాశనం చేసాయి అనుకుంటుంది మనిషిలోని మంచి తనాన్ని గుర్తించి అతనితో జీవితాన్ని పంచుకోవడానికి ఒప్పుకుంటుంది.

ఇందిర ఏ పని అయినా మంచి అయినా చెడు అయినా తెలిసే చేస్తుంది మొహమాట పడటం అనేది అసలు ఉండనే ఉండదు. తన బ్రతుకు తను బ్రతకాలి అనుకున్నపుడు ఇతరులకి ఇబ్బంది కల్గించినా పట్టించుకోకుండా బ్రతకడం నేర్చుకుంటుంది. ఆమె అతిని ఎప్పుడూ ఇష్టపడదు, అతి ప్రేమ చూపించినా,అతిగా గౌరవించినా ఆమెకి ఇష్టం ఉండదు ఆమె ప్రవర్తన తెలిసి కూడా ఆమెని పెళ్లి చేసుకుంటానికి ముందుకు వచ్చిన కృష్ణ మూర్తి కూడా ఆ విషయాన్నే చెపుతుంది తానూ అతనికి లొంగి ఉండలేనని, తన వ్యక్తిత్వాన్ని చంపుకుని ఉండలేనని బ్రతుకంతా నిర్భయంగా బ్రతుకుతానని అంటుంది.

పురుషాధిక్య సమాజంలో మధ్య తరగతి కుటుంబం లో డుర్వ్యసనాల తండ్రికి కూతురిగా ఉండి సమాజ పోకడల్ని బాగా అర్ధం చేసుకుని తనని తానూ నిర్మించుకుంటూ, అవసరం అయితే తనని తానూ తగ్గించుకుంటూ, కొందరి బలహీనతలని తనకి అనుకూలంగా మలుచుకుంటూ నచ్చినట్లు ఉండగల్గే ఇందిర ఎక్కడా కూడా తొట్రుబాటు లేకుండా ఎలాంటి ముసుగు వేసుకోకుండా నిర్భయంగా, స్వేచ్చా ప్రవృత్తి తో కనిపిస్తుంది జీవిస్తుంది.

ఇందిర లాంటి స్త్రీని సమాజం హర్షించక పోవచ్చు సమాజంలో కల్యాణి లు లాంటి వారితో పాటు కానీ ఇందిరలు కూడా ఉంటారని చెప్పడమే కావచ్చు స్త్రీల ఆలోచనా విధానం మారుతుందని చెప్పడం కూడా ఈ రచనలో గోచరిస్తుంది.

మనుషులు ఏ లోపాలు లేకుండా ఉండరు. మనుషులు మనుషుల్లాగానే ఉండాలి తమలో ఉన్న లోపాలని సవరించుకుంటూ చైతన్యంగా ఆలోచించుకుంటూ ముందుకు సాగిపోవడమే మంచిదని "కాలాతీత వ్యక్తులు" నవల చెపుతుంది.


పాశ్చత్య నాగరికత ప్రభావంతో చదువులభ్యసించి ఉద్యోగాలు చేస్తున్న స్త్రీలలో ఆలోచనా పరిణితి పెరిగి వారి వారి అభిరుచిల మేరకు, ఆశలకు, ఆశయాలకు అనుగుణంగా జీవించాలనుకోవడం తప్పు కాదు జీవితాన్ని జీవించడం కోసమే అనుకుంటూ ముందుకు సాగే వ్యక్తి ఇందిర పాత్ర. కాలగమనంలో అందరూ మరుగున పడిపోతారు కాలానికి విభిన్నంగా నడుచుకుని తనదైన వ్యక్తిత్వంతో తన చుట్టూ ఉన్న వారి జీవితాలనీ కూడా ప్రభావితం చేస్తూ సాగగల్గితే వారు మరి కొంత కాలం గుర్తుండిపోతారు అది నవలలో పాత్రలు కావచ్చు నిజ జీవితంలో మనుషులు కావచ్చు.

ఈ నవలలోని ఇందిర పాత్రని నేడు అధిక సంఖ్యలో మన సమాజంలో నిత్యం చూస్తుంటేనే ఉంటాము . కానీ ఇప్పటికి కూడా "ఇందిర " ని హర్షించలేక పోతున్నాం. ఇంకా నవలలో మిగిలిన పాత్రలు కల్యాణి,వసుంధర, వైదేహి లాంటి స్త్రీల మధ్య "ఇందిర " కాలాతీత వ్యక్తి తానూ చీకటిలో ఉండాల్సి వచ్చినా వెరువని ధీర, చీకటిని చీల్చుకుంటూ వెలుగుతూ వచ్చిన ఇందిర.

(ఈ నవల దారావాహికంగా సాగి పూర్తి అయిన వెంటనే 8-2-1958 లో సి . సరళా దేవి ఒక సమీక్ష, 2000 సంవత్సరంలో డా॥వి చంద్రశేఖర రావు గారు సమీక్షించారు.

ఇందిర గురించి మనం చదవాలంటే ఇప్పుడు లభ్యమవుతున్న ఈ నవల లో జతపరిచిన రెండు సమీక్షల జోలికి పోకుండా ఆ నవల ని చదివితే బాగుంటుంది అన్నది నా అభిప్రాయం )

ఈ నవల విశాలాంద్ర ప్రచురణ

* ఈ వ్యాసం "సారంగ " వెబ్ పత్రికలో (ప్రధమ సంచిక ) తర్వాత మార్చి నెల "భూమిక " లోను ప్రచురితమైనది.