లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ - వనజ తాతినేని.
తీర్చి దిద్దినట్లు వుండే కనుబొమ్మలు అర్దచంద్రాకారంలోకి
కుంచించుకుపోతుంటాయి
వయసు తరుగుతున్నందుకు సాక్షిగా.
రెండు దశాబ్దాలుగా తెరకు అలవాటైన విశాల నేత్రాలు
అలసి రెప్పలను మడతవేస్తాయి.
వైభవం కోల్పోయిన ఫాలభాగం చిన్న స్టిక్కర్ తో
సరిపెట్టుకుంటుంది.
కాంతులీనే కేశసంపద రంగు రూపు మార్చుకుని సౌందర్యాన్ని సగం మింగేస్తాయి.
వయసు పెరుగుతుందని అద్దంలో చూసుకున్న ప్రతిసారీ గుర్తు చేస్తూ.
విటమిన్ లోపం వల్ల తళతళలాడే పలు వరుస క్రమం తప్పి
వంకర టింకర చిరునవ్వును దాచుకుంటాయి.
హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ వల్ల అవాంచిత రోమాల తొలగింపులో
బెల్లం ముక్కలాంటి గడ్డం నల్లగా నిగనిగలాడుతుంది.
శంఖంలాంటి కంఠానికి పెట్టని నగలా వుండే చారలు
ముడతలుగా స్థిరపడిపోతాయి.
నీ గోధుమ రంగు ఛాయ నలుపు క్రమంలో జారుతూ
నిస్తేజంగా మారుతుంటుంది.
ఖరీదైన చీరలు మాటున రింగ్ నెక్ బ్లౌజ్ మాటున
బాడీ ఫిట్నెస్ బాల్యాని వెతుక్కుని పారిపోతుంది.
టాల్కెం పౌడరు కూడా స్వీకరించలేని నీ శరీర సున్నితత్వం
బ్యూటీ కేర్ స్కిన్ కేర్ అంటే ఏమిటని ప్రశ్నించే నీ తత్వం
ఆర్థో డాంటిస్ట్ ని కూడా కలవడానికి ఇష్టపడని విముఖత్వం
ఇదే ఇప్పటి నీ అలంకారం.
నలబై ఏళ్ళ క్రితం నిన్ను నా ఫస్ట్ క్రష్ అని చెప్పుకున్న అతను
హఠాత్తుగా ఎదురైన నిన్ను చూసి ఆ అందమంతా ఏమైపోయింది
అంటాడు ఆశ్చర్యంగానూ జాలిగానూ.
నువ్వు పగలబడి నవ్వుతావ్ అప్పుడు. లోలోపల కొద్దిగా దిగులు పడతావ్.
జీవితం కాటేయకపోతే అలాగే వుండేదాన్నేమో అనుకుంటావు కూడా.
అయినా సరే…
నువ్వు ఆత్మవిశ్వాసం అనే అందంతో ఆకర్షణీయంగా వుంటావ్
ఎవరికి తలొంచని తలెగరేసే పొగరుతో మెరిసిపోతావ్,
ఇంకో రెండేళ్ళకు ఆరవ దశాబ్ధంలోకి అడుగుపెట్టబోయే నీకు
అందానికి నిర్వచనం ఏమిటో బాగా తెలుసు.
ఈస్తటిక్ సెన్స్ అంటే ఏమిటో కూడా తెలుసు.
అందుకే నీకు నువ్వు అందంగా గర్వంగా వుంటావ్
ఎవరేమి అనుకుంటే నాకెందుకు!?
Did you Know! I am Very beautiful.
Life is Beautiful Life is Beautiful.
(Manifesto for Women Over Forty)
21 June 2026. 10:20 pm.

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి