13, జూన్ 2013, గురువారం

చేరేదెటకో తెలిసి



సమయం పన్నెండు గంటలప్పుడు మొబైల్. స్క్రీన్ పై కనబడుతున్న నంబరు చూసి   ఆశ్చర్యపోలేదు కానీ .. రింగ్ అయిన శబ్దానికి ఇంట్లో ఉన్న వాళ్ళకి  నిద్రాభంగం  అవడం అటు ఉంచి అనేక అనుమానాలు రావడం  ఖాయం అనుకుంటూనే  సైలెంట్ లోకి మార్చి బెడ్ దిగి హాల్లో ఉన్న లాండ్ లైన్ దగ్గరకి రాబోయింది  కుముద . ఆమె ఫోన్ దగ్గరకి వెళ్ళే లోపే  ఆ ఫోన్ మ్రోగడం  హాల్లో పడుకున్న తండ్రి ఫోన్ తీసి ఎవరూ అని అడగడం  జరిగిపోయాయి. అవతలి వ్యక్తీ  ఏమి అడిగాడో ?   తండ్రి సమాధానం ఇవ్వకుండానే  అతను లైన్ కట్ చేయడం జరిగిపోయాయి.

"ఎవరో .. శంకర్ ఉన్నాడా? అని అడిగాడు . సమాధానం చెప్పేలోగానే  పెట్టేసాడు " అన్నాడాయన ఆమె వంక అనుమానంగా చూస్తూ.

కుముదకి చాలా సిగ్గనిపించింది ఎన్నడూ లేనిది తండ్రి ముందు చాలా  అవమాన పడినట్లై౦ది.  నాకు ఈ స్నేహం అవసరమా ?  అని కోపంగా ప్రశ్నించుకుంది.  అలా ప్రశ్నించుకోవడం అనే గొప్ప అలవాటు వలనే   ఎన్నో తప్పుల బారిన పడకుండా   ఆమెని ఆమె నియంత్రించుకుంది.

"ఛీ ఛీ .. ఇతనికి బుద్ది  లేదు నన్నెందుకు  అస్తమాను  ఇలా తన  వాళ్ళ ముందు తలవంచుకునేలా నిలబెడతాడు. రేపు ఉదయమే ఫోన్ చేసి  నాలుగు కడిగేసి అతనితో తనకున్న స్నేహానికి గుడ్ బై చెప్పాలి" అనుకుంది కోపంగా.

అలా అనుకుందో లేదో .. మెసేజ్ వచ్చిన చప్పుడు . చేతిలోకి ఫోన్ తీసుకుని చూసింది .. "హాయ్ బంగారం "
మనసులో ఉన్న ప్రేమనంతా రంగరించి మెసేజ్ లో  గ్రుమ్మరించినట్లు.

చప్పున ప్రేమ పరిమళం  ఏదో కుమదని చుట్టేసిన భావన. మనసు ఆపుకోలేక ఆ మెసేజ్ ని  మనిషిని తడిమినట్లు ఆత్మీయంగా తడిమింది. ఆమె చూపులు అప్రయత్నంగా ఆ పేరు పైన  ఆగాయి .. "సురేష్  " ఆ పేరు వింటేనే ఆమెకి  వివసత్వం. ఎన్నడూ నవ్వని పెదాలు మెల్లగా విచ్చుకుంటాయి కళ్ళలో పొంగిన   సంతోషం ముఖమంతా ఎగబ్రాకి పోతుంది. బహుశా దానిని కవుల భాషలో ప్రేమంటారేమో!  అని అనుకుంటూ నవ్వుకుంటుంది . 

అతని పరిచయం ఏ  మాత్రం ఊహించనిది.  ప్రెవేట్ ఎఫ్.ఎమ్ ల పుణ్యమా అని జీరో అవర్స్ లో కూడా కాల్ చేసి మాట్లాడటం, ఇష్టమైన పాట  కోరుకోవడం ఇష్టమైన వారికి డెడికేట్ చెయ్యడం ని బాగా ఎంజాయ్ చేసే రోజులవి.
ఆ రోజే  ఆత్మీయంగా మసలుకుంటూ తమ్ముడూ అని పిలిపించుకుంటూ   ఉండే "నివాస్ " ఒక విషయం చెప్పాడు "ఈ రోజు మనలని చూడాలని ఒక లిజనర్ వచ్చారు "తార్నాక " లో ఉంటారట మిమ్మల్ని చూడాలని అడిగారు . అలా ఎవరూ కలవడం నీకిష్టముండదు  కదా ! అందుకే నువ్వు ఊర్లో లేవని అబద్దం చెప్పాను, ఫోన్ నంబర్ అడిగారు లాండ్ లైన్ నంబర్ ఇచ్చాను"  అని చెప్పాడు. 

“మంచి పని చేసావు” అని మెచ్చుకుని  అతని నంబర్ తీసుకుంది. ఎప్పుడైనా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకుండా ఉండటం మంచిదనే ఉద్దేశ్యం తో ముందు జాగ్రత్తగా.

అదే రోజు రాత్రి ఒక అసహన  సమయంలో ఒకే ఒక క్షణం  లో రేడియోకి లైన్ కలవడం ఆ అసహనాన్ని  తగ్గించుకోవడానికి చల్లని పాటా కోరుకోవడం అలవాటుగా ఎవరికీ డెడికేట్ చేస్తున్నారు? అని  ఆర్ జె అడిగిన ప్రశ్నకి "సురేష్  " కి అని చెప్పడం జరిగిపోయాయి. పాటతో పాటు అతని కాల్ తనని పలకరించాయి.  ఆ మాట ఈ మాట  తో చిన్నపాటి పరిచయం అంతే ! మరునాడు ఆమెని చూడాలనే ఆత్రుత తో అతను ప్రత్యక్షం కావడం ఏ మాత్రం  ఊహించని విషయం.

కుముద ది  పెక్యులియర్ వాయిస్. అలాగే  ఆమె  సంభాషణా చాతుర్యం, విషయ పరిజ్ఞానం వల్ల  ఆమె  అంటే ఎంతోమందికి అభిమానం. ఆర్ జె కబుర్లు మాకెందుకు కుముద గారి మాటలు వినడం కోసమే అర్ధరాత్రుళ్ళు మేలుకుని రేడియో వింటున్నామని  అనేవాళ్ళు ఎక్కువయ్యారు  అలాంటి .అభిమానగణం  ఉన్న కుమద ని ఇష్టపడటంలో తప్పేముంది ? అంటూ .. సురేష్  తన మనసులో మాట చెప్పేయగానే గుండె గుబేల్ మంది. క్షణ కాలం అతనిని పరికించి చూసింది ఒకింత నిర్మోహమాట మైన మాట .. ఎప్పుడూ నవ్వినట్లు ఉండే కళ్ళు.,. ప్రశాంత వదనం. ఆ నడక ఏదో ప్రత్యేకత ఉంది ఇతనిలో.   ఆ ఆకర్షణలో పడకుండా ఉండటం చాలా కష్టం అనుకుంది.

ఒంటరిగా  ఉండే ఆమె జీవనంలోకి ఆతను ప్రత్యక్షంగా కాకపోయినా  నిత్యం ఫోన్ ద్వారా  మాట్లాడడంతో పరోక్షంగా జొరబడి పోయాడు. వారి వేవ్ లెంగ్త్  బాగా కలసి పోయాయి.

ఒకరోజు అడిగింది "ఇలా మీరు రోజు  నాతో మాట్లాడటం నాకు నచ్చలేదు. మీ భార్య కి  తప్పకుండా అభ్యంతరం ఉంటుంది కాబట్టి నాకు కాల్ చేయకండి " అని చెప్పింది.

"నాకు మాత్రం ఎవరున్నారు నేను మీలాంటి వాడినే ! నా భార్య నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయింది ఒక అమ్మాయి ఒక అబ్బాయి. వాళ్ళ బాధ్యతలో  నన్ను నేను అంకితం చేసుకుని ఇష్టమైన వ్యాపకాలు కొనసాగిస్తూ జీవితం గడుపుతున్నాను " అని చెప్పాడు.

కుమద ఆశ్చర్య పోయింది " ఇద్దరు బిడ్డల తల్లి. ఎంత బలమైన కారణాలు లేకుంటే  బిడ్డలని కూడా కాదని వెళ్ళిపోతుంది ? కారణాలు ఏమైనా ఆమెని మీరు వెళ్ళి స్వయంగా ఆహ్వానించండి " అని చెప్పింది.

అలా కుముద రెండు మూడు సార్లు చెప్పడం ఆతను మౌనం వహించడం వెనుక ఏదో బలమైన కారణం ఉండి  ఉంటుంది. అంతకన్నా తన జోక్యం మంచిది కాదు అన్నట్లు ఊరుకుండి  పోయింది. నెలలు గడుస్తున్న కొద్ది వారి రువురి మధ్య చొరవ పెరిగింది. ఏ విషయాన్ని అయినా నిస్సంకోచంగా మాట్లాడుకునే అంత స్నేహం కుదిరి పోయింది.

ఒకనాడు  న్యూస్ పేపర్ లో ఒక విషయాన్ని  చదివిన కుముద వణికి పోయింది . ఏటేటా పెరుగుతున్న హెచ్ ఐ వి బాధితుల సంఖ్య అని వార్తని చదవగానే ఆమెకి చప్పున సురేష్  గుర్తుకు వచ్చాడు ' ఆ రాత్రి ఫోన్ చేసినప్పుడు మీ నగరంలో హెచ్ ఐ వి ఉదృతి ఎక్కువ ఉంది అని వింటున్నాను, జాగ్రత్త”అంటూ హెచ్చరించింది

ఆతను బిగ్గరగా నవ్వడం వినిపించింది.

"ఎందుకు నవ్వుతారు ?" కినుక ఆమె గొంతులో.

"నా పట్ల నువ్వు  చూపిస్తున్న శ్రద్ధకి " .. అంటూ మళ్ళీ నవ్వాడు . "పర స్త్రీ ల వైపు కన్నెత్తి కూడా చూడను" నమ్మకంగా చెప్పాడు.  ఆమె రిలీఫ్ గా ఫీల్ అయింది.

ఒకరోజు చనువుగా అడిగాడు.. "నేను రానా ఇంటికి ?"

ఆమెలో కంగారు. "ఈ సమయం లోనా ? వద్దు ఎవరైనా చూస్తే బావుండదు".

"మనిద్దరికీ ఇష్టం అయినప్పుడు ఎవరేమి అనుకుంటే మనకెందుకు ? ఇప్పుడే వస్తాను "  అడిగాడు. 

 అతనికి అలాంటి ఉద్దేశ్యం  కలగడం ఆమె ఊహించనిది . అలాంటి అభిప్రాయాన్ని  తుడిచి వేయాలనుకుని  "సురేష్  .. నేను చెప్పేది వినవా ? "అభ్యర్ధనగా అడిగింది

"తప్పకుండా వింటాను... చెప్పు బంగారం !"

మన అభిరుచులు, ఇష్టాలు, మనకి కల్గే భావాల పట్ల ఉన్న  సారూప్యం మనలని కలిపి ఉంచడానికి ఏ మాత్రం దోహదపడదని నాకు తెలుసు.  మనది పరస్పరాకర్షణ ల వలలో చిక్కుకునే వయసు కాదు . వివాహ వైఫల్యంతో బిడ్డలనే ఊపిరి  చేసుకుని బ్రతుకున్న వారిమీ. ఎన్ని రాత్రులు మన మన లోపాలను,ఆకాంక్షలను ,  ఏ ముసుగు వేసుకోకుండా  మనసు విప్పి చెప్పుకున్నాం కదా ! . మన మధ్య మన గురించి కన్నా మన పిల్లల భవిష్యత్ గురించి కనే కలలే ఎక్కువ ఉండేవి.  సానుభూతి,కరుణ, అవగాహన తో మనం మాట్లాడుకున్న మాటలలో ఒకరంటే మరొకరికి ఉన్న గౌరవాన్ని  ఎప్పుడూ అలాగే నిలబెట్టుకునే ప్రయత్నం  చేద్దాం.  ఎవరు ఏమనుకుంటున్నారో  మనకి అనవసరం కానీ మనకి మనం అద్దంలో చూసుకుంటున్నట్లు ఉండాలి.  ఎలాంటి వికారాలు మన మనస్సులో   లేకుండా రానీయకుండా మనం ఉండలేమా? మన మనసులు కలిసి ఉండవచ్చు. మీరు కోరుకున్నట్లే మీ  సాన్నిహిత్యం కావాలని పదే పదే నా మనసు కోరుకుంటుంది.   అది  కూడా తప్పే కావచ్చు మీతో సన్నిహితంగా మెలిగితే  బావుండునని నా శరీరభాష చెపుతుంది  అయినా  మనం హద్దులు దాటి  స్త్రీ పురుషుల స్నేహాన్ని   శరీర సంబంధాల భాషలో చూడటం  నాకిష్టం లేదు.  నా వరకు నేను నిబద్దత తో ఉండాలని కోరుకుంటాను ఇతరులు అలానే ఉండాలని కోరుకుంటాను, అంతకి మించి ఏమైనా కోరుకుంటే మన ఈ స్నేహానికి  అర్ధం ఉండదు. .అని చెప్పి  "మీకు నా పై స్నేహం కాని మరొక  అభిప్రాయం  ఉండి ఉంటే ఆ అభిప్రాయం మార్చుకుంటే మంచిది  కూడా"  చెప్పేసింది .

"మనసులో ఒకటి ఉంచుకుని పైకి మరోలా ఉండటం నా వల్ల  కాదు"  చెప్పాడతను

"నా వల్ల  అవుతుంది " ఖండితంగా చెప్పింది. “ఒక స్త్రీ -పురుషుడు మధ్య శారీరక సంబంధం లేని స్నేహం ఉండ కూడదా  ఏమిటీ ?  మీ మగవాళ్ళు అందరూ  స్నేహాన్ని అర్ధం చేసుకోలేరూ? ఎక్కడ మొదలెట్టినా స్నేహాన్ని  తుదకు  శారీరక  సంబంధం దగ్గరకే తీసుకువచ్చి ఆపుతారు .. ఛీ ఛీ “ అని విసుక్కుంది.

మనసులో ఇలా అనుకుంది  "మీకు పరిచయం ఉన్న ఆడవాళ్ళందరూ,  తారసపడిన వాళ్ళందరూ స్నేహాన్ని మీరు కోరుకునే స్థాయికి దించేసి ఆ స్నేహానికి మరో అర్ధం చెప్పవచ్చు . కానీ వారందరి లాంటి దానిని నేను కానే కాదని  మీకు తెలియజేయడానికి, అర్ధం కావడానికి   చాలా సమయం పట్టవచ్చు.  మీకు  స్త్రీలందరూ  అలా ఉండరని నిరూపిస్తూ.. మీ మనసు, బుద్ది వికసించేటట్లు చేయక పొతే చూడండి అనుకుంది.  మనసులో చాలెంజ్ కూడాచేసింది.

పెళ్ళితో ముడిపడని బంధాలేవో  వారి మధ్య బలోపేతం చేసుకోవడానికి  అతను రంగం  సిద్దం చేసుకోవాలని ప్రయత్నించే లోపే సురేష్ కి అతని భార్యకి మధ్య ఉన్న  అపోహలు తొలగిపోయి భార్యని భర్తని కలపని దేవుడే లేడని అన్నట్లు వారి  కాపురం కుదుట పడింది. 

వారి సంసార రధం హాయిగా సాగిపోతూనే  ఉంది. 

అలా నాలుగేళ్ళు గడచి పోయాయి. అప్పుడప్పుడూ నిద్రపట్టని రాత్రులలో భార్య  సముఖంలోనే కుముద తో గంటలు తరబడి మాట్లాడటం ఆమె  ముందు కుమదని విపరీతంగా మెచ్చుకోవడంని  ఆ భార్య మాత్రం ఎలా ఓర్చుకోగలదు ?  కుముద తో స్నేహాన్ని, ఆమెకి చేరువకాబోయి  వీలుకాక విడివడిన  విషయాలని చెపుతుంటే   ఆమె  జీర్ణించుకోవడం ఎంత కష్టం ?  కానీ ఆతనలలాంటివన్నీ  పట్టించుకోడని అర్ధం అయ్యాక కుముద అతని ఫోన్ ని లిఫ్ట్ చేయకుండా జాగ్రత్త పడేది.  వీలయితే పగటి పూట నాలుగు మాటలు క్షేమ సమాచారం .. అంతవరకే ! అలా చేయడం వలన అతనికి చాలా అసంతృప్తి ఉండేది.

"ఈ మధ్య నన్ను కావాలని నిర్లక్ష్యం చేస్తున్నావ్ ! " ఆరోపణ.

"లేదు లేదు, అదివరకు అంటే నేను ఒక్కదాన్ని ఉండేదాన్ని.ఇప్పుడు అలా కాదు ఇంట్లో నాతో పాటు కొందరు ఉన్నారు.  వారి మధ్య అర్ధరాత్రుళ్ళు మాట్లాడుతూ ఉంటే  ఏం  బావుంటుంది చెప్పండి ?  నా వాళ్ళందరూ నా గురించి తప్పుగా ఊహించడం కూడా నేను భరించలేను " వివరణ ఇచ్చింది.

  “నిండు యవ్వనాన్ని ఒంటరితనం తో గడిపేస్తున్నావ్? ఎందుకు అలా నిన్ను నువ్వే శిక్షించుకుంటావ్. జీవితంలో లభించిన కొన్నింటిని అందుకోవాలి. మనసైన మనిషితో సన్నిహితంగా ఉంటే  తప్పేమిటి?” అతని ప్రశ్న.  

“సురేష్  ! తప్పు ఒప్పుల సంగతి కాదు .. నేను ఆలోచించేది . నాది  కాని పరాయి వస్తువుని  నేను కన్నెత్తి కూడా  చూడను.  అది నాకెంత అవసరమైన వస్తువైనా సరే! మనిషైనా సరే!   నన్ను ప్రేమించే మనిషి నాకు మాత్రమే  పరిమితమైన మనిషి, నేను ఏడిస్తే అతని కళ్ళల్లో నీరుండాలి,  నేను నవ్వితే అంతకన్నా బాగా నవ్వగలగాలి, నేనే అతనై   అతనే నేనై బ్రతుకంతా ఇమిడి పోవాలి. కానీ  మీరు చెప్పే పార్టిషన్ లైఫ్ నాకు వద్దనే వద్దు,  నేను కోరుకునేది  ఇవ్వగలిగే  అవకాశం ఉంటే  చెప్పండి, అప్పుడా లోచిస్తాను " పట్టుదలగా చెప్పింది.

“మనం అలాంటి పరిమితమైన సంబంధంలో ఉండే అవకాశం ఇప్పుడు రాదు కదా ! నా కంటూ వేరే జీవితం ఉంది, పిల్లలు ఉన్నారు., ఎలా సాధ్య పడుతుంది   చెప్పు?

"అందుకేగా  నేను వద్దంటున్నాను"  స్థిరంగా  చెప్పింది

"నిన్ను చూస్తే జాలివేస్తుంది .. "

“నన్ను చూసి జాలిపడవద్దు వీలయితే తిట్టుకోండి! ఇంకా పచ్చిగా చెప్పాలంటే దీని చుట్టూ తిరిగే కన్నా వేరేవారి చుట్టూ తిరిగినా వర్కవుట్ అయ్యి ఉండేదని  కసిగా తిట్టుకోండి “ సలహా ఇచ్చింది.

ఆతను దెబ్బతిన్న పక్షిలా విలవిలలాడిపోయాడు . “ఇంతేనా నన్ను అర్ధం చేసుకుంది?” బాధగా అడిగాడు .

"నిష్టూరంగా ఉన్నా నేనిలాగే మాట్లాడతాను, సారీ సురేష్ !  ఇకపై ఇలాంటి ప్రసక్తి మన మధ్య రాకూడదు"  గట్టిగానే చెప్పాననుకుంది కుముద.

సురేష్  కి  కుముద పై మునుపటికంటే  ఎక్కువ ఇష్టం కల్గుతుంది.  

ఏళ్ళు గడుస్తున్న కొద్ది సురేష్  లో బలవత్తరమైన కోరిక.  భార్యని ఒప్పించి అయినా సరే కుమద కి అతని జీవితంలో స్థానం ఇవ్వాలని కోరుకుంటున్నాడు.  అది కుముద గుర్తించి పర్యవసానం ఎలా ఉంటుందో మాటల్లో చెప్పింది.

 “ సురేష్ ! అంతకు ముందు మీ భార్యాభర్తల మధ్య   అపార్ధాలకి కారణమేదో నాకు తెలియదు,ఇప్పుడు మీ మధ్య  వచ్చే అపార్ధాలకి  నేనంత  మాత్రం  కారణం కాకూడదని నేనో కఠిన నిర్ణయం తీసుకున్నాను. మీ నుండి వచ్చే ఎలాంటి సందేశాన్ని చూడకూడదని, మీ మాట విననే కూడదని  నిశ్చయించుకున్నాను.  నాకు ఎప్పుడూ కాల్ చేయకండి .. నన్ను కలవాలని ప్రయత్నించకండి” అని చెప్పింది.

ఆతను విననట్టే ఉండేసరికి .. ఇంకా వివరంగా చెప్పాల్సి వచ్చింది  విసుగ్గా ముఖంపెట్టి గొంతులోకి కాఠిన్యం అరువు తెచ్చుకుని…

"ఈ అక్రమ సంబంధాల అవసరమో ,  అన్ కండీషనల్ లవ్  అవసరమో  నాకు లేదు. మీకు అంతగా ఇష్టం అయింది   కాబట్టి పెళ్లి చేసుకుని రెండో భార్యగానో లేదా స్టెప్నీ  మాదిరి గానో ఉంచుకుంటానంటారు! అంతేగా ? మీ మగవాళ్ళ ఆలోచనలు ఎన్నటికి మారవు . ప్రేమో , వ్యామోహమో రెండిటికి తేడా తెలియదన్నట్లు బిహేవ్ చేస్తారు . మీ చేతుల్లో మైనం ముద్దగా మారేదాకా అనేక మాయమాటలు చెపుతారు మీకు కావాల్సింది దొరికాక మీ మోజు తీరిపోయాక శీతకన్ను వేస్తారు.  ముందు రోజూ ఆడదాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు . తర్వాత తర్వాత పనుల వత్తిడి అంటూ వారానికి ఒకసారి దర్శనం ఇస్తారు, మరి కొన్నాళ్ళకి మోజు తీరిపోయి పూర్తిగా  మరచిపోతారు . అందులో ఆయాచితంగా లభించే వొంక ని ఉపయోగిస్తారు, ఇంట్లో తెలిసి పోయింది, గొడవ ఎక్కువైపోయింది అంటూ తెర దించేస్తారు.  అంతకి మించి క్రొత్తగా ఏమైనా  ఉంటే చెప్పండి!  విని నా నిర్ణయం చెపుతాను"  అని నిలబెట్టి దులిపేసింది

కుముద అలా మాట్లాదగలదని ఊహించని సురేష్  అవాక్కైపోయాడు.  ఆ ఆవేశంలోనే అతనికి ఇంకొన్ని కఠోర సత్యాలు చెప్పింది.

“ఒకటి మాత్రం  స్పష్టంగా చెప్పగలను సురేష్  !   ఈ సహజీవన బంధంలో మిమ్మల్ని  హోల్డ్ చేయగల కెపాసిటీ నా దగ్గర ఉంటే  అందుకు బలి అయిపొయ్యేది మీ  భార్య పిల్లలు . అలాంటి హోల్డింగ్ కెపాసిటీ నా దగ్గర లేకపోతే  నాకే సొంతం కావాలనుకునే నా మరోమనసుని , ఆ మనసు నడిపించే మనిషిని నేను కోల్పోతాను. ఇంకోసారి  నన్ను అమితంగా  ప్రేమించే మనిషిని , నా  మనసుని కోల్పోయి  జీవచ్ఛవంలా బ్రతకలేను.  ఆ బాధని భరించడం కన్నా  మీరు  ఆశిస్తున్న బంధంలో మంచి చెడులని   బేరీజూ వేసుకుని  ఈ ఆశాభంగాన్ని  తట్టుకుని బ్రతకడమే నాకిష్టం, నన్ను వదిలేయండి.నా బ్రతుకు నన్ను బ్రతకనీయండి,”  చేతులు  జోడించి వేడుకుంది.

సురేష్   ఏమనుకున్నాడో ఏమో కాని తర్వాతెప్పుడూ కుముదని డిస్ట్రబ్ చేయలేదు. 

అతనిపై  ఉన్న ఇష్టాన్ని,  ప్రేమ నంతటిని గుండెల్లో భద్రంగా దాచుకుని తన జీవితాన్ని తానూ సాధించుకునే పనిలో ఆమె అలసి పోతూనే ఉంటుంది. అతను  ఎంత దూరంలో ఉన్నా ఎన్ని ఏళ్ళు గడిచినా తన  పట్ల  సురేష్  లో ఉన్న అభిమానం లో ఎలాంటి మార్పు లేకపోవడం చూసి బాధపడుతుంది.  ప్రేమని, ఇష్టాన్ని ప్రకటించే వారిని ఎవరు మాత్రం కాదనగలరని అనుకుంటుంది కానీ  అతన్ని మాత్రం దూరంగానే ఉంచగల్గిన కఠినత్వం అలవాటు చేసుకుంది.

 నేను నిన్ను వదలబోను అంటూ  అప్పుడప్పుడూ అతని పలకరింపు. చెప్పా పెట్టకుండా హటాత్తుగా ఊడిపడి ఆమెని అలా  ఓ నిమిష కాలం చూసి వెళ్ళిపోయే చూపు. ఎంత మర్చిపోదామన్నా ఆమెకి గుర్తుకు రాక మానవు, నిట్టూర్పు విడువక మానదు.
.
కట్టువిప్పిన లేగ దూడ తల్లిని వెతుక్కుంటూ పరువులు తీసినట్లు గాఢమైన ప్రేమ నిండిన అతని పలకరింపు  తనని అతని దరికి చేర్చుతుందని  అంతర్లీనంగా  ఆమెలో ఒక భయం.   అందుకే ఆ బలహీన క్షణాలకి చిక్క కుండా   ప్రేమ సందేశాన్ని మోసుకువచ్చే ఆ ఫోన్ ని గిరాటు కొడుతుంది. పట్టువదలని విక్రమార్కుడిలా మరొక ఫోన్ కి ప్రయత్నం చేస్తాడు.   కుముద  నిర్దాక్షణ్యం గా  ఆ మరో ఫోన్ పీక నొక్కుతూనే  ఉంటుంది.
.
" నా బలం ఏమిటో ,నా బలహీనత ఏమిటో అన్ని తెలిసిన అంతరంగికుడివి.  నన్ను అర్ధం చేసుకున్నట్లే ఉంటారు, నాపై జాలి చూపుతారు, మళ్ళీ అంతలోనే వేధిస్తారెందుకు ? అంటూ మనసు మూలుగుతుండగా స్వగతంలో అనుకోబోయి  ఒకోసారి పైకే అనేస్తుంటుంది.   

" మనసునెందుకు అలా చంపేస్తావు ! కోరికల్ని ఎందుకు అలా అణచి పెట్టుకుంటావు"  సూటిగా ప్రశ్నిస్తాడతను 

"మనసా.! గినసా? జానే దో!"  అంటుంది నవ్వుతూ.

“మాట మార్చేయడంలో  పట్టభద్రురాలివి’’ అని కితాబునిస్తాడు .

" మాట కోసం మనిషిని,  ఇతరుల కోసం  వైవాహిక జీవితాన్ని త్యాగం చేసిన మనసు నీది  కదా !  నీ గురించి నా కన్నా ఎవరికీ తెలుసు, నేను కూడా అలా వదిలేస్తే ఎలా? అంటూనే... నీకున్న స్వేచ్ఛ ఎవరికైనా ఉండి ఉంటే లైఫ్ ని ఎంత ఎంజాయ్ చేసి ఉండేవారో!”  అని నిష్టూరం ఒలికిస్తాడు.

 "ఇదంతా నా మీద ప్రేమ నంటావా?  ప్రేమ మాత్రమే కాదని అంతకు మించి ఆసక్తి ఉందని నాకు తెలుసులే! "  ఆట పట్టిస్తుంది.

" నీకు తెలుసునని నాకూ  తెలుసు, అయినా ఇద్దరం విడి విడిగా ఉండటం కూడా తెలుసు" అంటాడు.

మళ్ళీ అంతలోనే మనం ఒకరినొకరు మోసం చేసుకోవడం లేదు కదా !  తీరని కోరికలు ఉంటే  ఆత్మ శాంతించదంట. చనిపోయాక కూడా దెయ్యమై  ఇక్కడిక్కడే  తిరుగుతూ  ఉంటూ  పీక్కు తింటావు జాగ్రత్త ! అని నవ్వుతూనే బెదిరిస్తూ ఉంటాడు  ఆఖరి రాయి వేస్తున్నట్లూ గా.

 "నేను దెయ్యాన్ని  కాదు,  కాను కూడా!  లైఫ్ టైమ్ ఫుల్ ఫిల్ హాపీ "  అంటూ సమర్దించుకుంటుంది

"ఎందుకు కాదు గుర్తుకువచ్చినప్పుడు దేవతలా  కళ్ళ ముందు కదలాడుతూ ఉంటావు. చికాకులలో ఓదార్చే మనసైన స్నేహితురాలివి అనిపిస్తావ్,  నిద్రని చెడ గొట్టినప్పుడు దెయ్యంలా కనిపిస్తావు." గట్టిగా నవ్వుతూ నిజం  చెప్పేస్తాడు.

“స్త్రీ -పురుషుల మధ్య ఇలాంటి ఆకర్షణలు లేకుంటే ఈ సృష్టి  రహస్యానికి అర్ధమే ఉండేది కాదు. నిబద్దత,  కట్టుబాట్లు లేకుంటే ఈ కుటుంబ  జీవనానికి అంతకన్నా విలువ ఉండేది కాదు కదా! ఎవరైనా ఎక్కడైనా ఏది ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే వెదుక్కోవడం మంచిది. మరొక చోట వెదుక్కుంటే కొన్నాళ్ళకి అశాంతి తప్ప ఏది మిగలదు” అనుకుంది  సురేష్ ని  గుర్తుచేసుకుంటూ కళ్ళల్లో నీళ్ళని జారనీయకుండా జాగ్రత్త పడుతూ.

 నేస్తమా ! నిరాశ, తమస్సులని తడచిన కనురెప్పల మధ్య దాచేస్తే,
పూడిపోయిన గొంతు వెనుక హృదయ వేదనని, రోదనని మాటేస్తే..
మాట మౌనం అవుతుంది. మనసు పాట పల్లవిస్తుంది. 

చేరెదెటకో తెలిసి
చేరువ కాలేమని తెలిసి ...
చెరిసగమైనామెందుకో....

12, జూన్ 2013, బుధవారం

"బ్లాగ్ కథలు - సేకరణ "

బ్లాగ్ మిత్రులకి ఒక ఆత్మీయ సందేశం .

 ఇప్పుడిప్పుడే క్రొత్తగా కలం పట్టారా?  వ్రాయాలనే ఉత్సాహం మీలో మెండుగా ఉందా? మరయితే బాగా వ్రాసేయండి .మేము బాగానే వ్రాస్తున్నాం .మా బ్లాగ్ ని ఎవరు చూడటం లేదు. మా వ్రాతలు ఎవరికీ నచ్చడం లేదా అనే అసంతృప్తి మీలో పేరుకుపోతే దానిని  ఇక ఇప్పుడు తుడిచి పెట్టేయండి

మన భావ ప్రకటనకి వేదిక మన బ్లాగ్. అందులో మీరు కూడా కథలు   వ్రాసే వుంటారు . కథ కాని కథలు చెప్పే ఉంటారు. మీరు మంచి కథకులు అనే విశ్వాసం మీకు ఉంటే  మీరు బాగా వ్రాసాను అనుకున్న కథలని  . ఇప్పటికే ఆ  కథ బ్లాగ్ లో ప్రచురింపబడి  ఉంటే . వెంటనే ఆ కథ యొక్క లింక్ ని  ఈ పొస్ట్ లో వ్యాఖ్య రూపంలో   జతపరచ వచ్చును .సులభంగా మీ కథలని ఎక్కువ మంది చదివే ఒక చక్కని అవకాశం ఇది

  మీరు వ్రాసిన చక్కని కథలని చదివి "ఆహా బ్లాగ్ లలో ఇంత మంచి కథలు ఉన్నాయా .. అని ఆశ్చర్య పోయేటట్లు చేద్దాం . అసలు మన బ్లాగ్ లు ఎందులో తక్కువ చెప్పండి ..?



ఇలా మన కథలని తెలుగు ప్రపంచానికి చేరువ చేద్దాం ..

వెంటనే మీ కథల లింక్ లని పంపండి  చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఆహ్వానితులే!

"బ్లాగ్ కథలు  - సేకరణ  " కోసం ఏమైనా సందేహాలు ఉంటె ఈ మెయిల్ ఐ డి ని సంప్రదించండి

 blaagkathalu@gmail.com

10, జూన్ 2013, సోమవారం

అతడు - ఆమె - ఒక మొబైల్



చెమటలు క్రక్కుకుంటూ వంటగదిలో  పని చేసుకుంటున్న సౌమ్య ఫోన్ మ్రోగింది..


చేస్తున్న పని ఆపి చేతులు కడుక్కుని నాప్కిన్ తో తుడుచుకుంటూ.. ఫోన్ లిఫ్ట్ చేసి  వీణ మీటినట్టు "హలో " అంది. 


"సౌమ్య గారూ!  నేనండీ .. సుమ ని" అంది సుమ. సౌమ్య వాళ్ళింటి పై భాగంలో అద్దెకి ఉంటారు. ఈ రోజే పిల్లలను తీసుకుని సెలవలకి పుట్టింటికి వెళ్ళింది.


"చెప్పండి  ఏమిటి విషయం ? ఎలా ఉన్నారు" అంది సుమ.


"నేను పిల్లలు బాగున్నాం  అండీ ! పిల్లల్ని తీసుకుని ఊరు వెళుతున్నాను. వారం రోజులు ట్రైనింగ్ కి వేరే  క్యాంపస్ కి వెళ్ళాలి. అత్తయ్య గారింట్లో పిల్లలని వదిలి రోజూ ట్రైనింగ్ కి వెళతాను. మా వారికి మీరు ఒక విషయం పాస్ ఆన్ చేయాలి" అంది.


"చెప్పండి సుమ గారూ! ఏం  చెప్పాలి ?


"ఉదయం ఇంటి నుండి బయలుదేరినప్పుడు నాతో మా ఫ్రెండ్ కూడా వచ్చారు లేట్ అయిపోతుంది అని నేను హడావిడి పడుతుంటే నాకు హెల్ప్ చేస్తూ  టేబుల్ పై ఉన్న ఫోన్ ని బేగ్ లో వేసేసింది. నేను ఇప్పుడే చూసుకున్నాను నా ఫోన్, మావారి ఫోన్ రెండూ ఒకే విధంగా ఉండటం మూలంగా ఎదురుగా కనిపించిన ఫోన్ నా ఫోన్ అనుకుంది . మావారు ఫోన్ కోసం వెదుక్కుంటారేమో! వారి ఫోన్ నా దగ్గరే ఉందని కాస్త ఆయనకీ చెప్పండి " అంది రిక్వెస్ట్ గా.


 "అలాగే నండీ!" అంటూ ఫోన్ పెట్టేసింది సౌమ్య 


సుమ భర్తకి విషయం చెపుదామని చూస్తే ఆతను కనపడలేదు.


సుమ ఆమె ఫ్రెండ్ కూడా కూడబలుక్కుని సుమ భర్త ఫోన్ కావాలనే పట్టుకుని వెళ్లి ఉంటారు అనుకుంది. సౌమ్య దానికి ఒక కారణం ఉంది. సుమ భర్త  చేసేది రాత్రి ఉద్యోగం. ఆమె స్కూల్ టీచర్ . ఆమె స్కూల్ కి వెళ్ళిన టైం  లో ఎక్కువ సేపు ఫోన్ లో మాట్లాడుతూనే ఉంటాడు.  ఆ విషయాన్ని  సౌమ్య గమనించి సుమని  హెచ్చరించింది.  ఆతను గంటల తరబడి మాట్లాడుతున్నాడు . మాట్లాడుతున్నప్పుడు నేను  చాలా సార్లు గమినించాను.  ఖచ్చితంగా  ఎవరో స్త్రీ తోనే మాట్లాడుతున్నారు,  కాస్త జాగ్రత్త పడండి.  అని చెప్పింది కూడా.



"అవునండీ నాకు చాలా అనుమానంగా ఉంది, పైగా ఆయన ఫోన్ ని ఎవరిని అంటు కోనివ్వరు, పిల్లలు ముట్టుకున్నా ఊరుకోరు, కొట్టేస్తారు" అని చెప్పింది  సుమ ముఖం మాడ్చుకుని.


ఆ విషయం గుర్తుకు వచ్చిన సౌమ్య ఇక సుమ భర్త పై సి . ఐ . డి  పని మొదలు పెట్టింది అనుకుంది. అనుమానం ఏర్పడినప్పుడు ఏ భార్య అయినా నిశితంగా పరిశీలించక తప్పదు కదా!


ఓ అరగంట తర్వాత వరండా లోకి వచ్చిన సౌమ్య కి మేడ పై భాగం  లో నుండి సుమ భర్త మాటలు వినబడుతున్నాయి.


" నా ఫోన్ నా దగ్గర లేదు .. మా ఆవిడ పట్టుకెళ్ళింది. నేనిప్పుడు  ప్రక్కింటి ఆయన ఫోన్ తీసుకుని మాట్లాడుతున్నాను, నువ్వు నిమిషానికి ఒకసారి మెసేజ్ లు పెట్టకు, నా పెళ్ళాం  చూసిందంటే కొంప కొల్లేరు అవుతుంది. తనకి అసలే నా  మీద అనుమానం గా ఉంది .. " అంటున్నాడు.


ఈ మాటలు వింటున్న సౌమ్యకి కూలిపోతున్న ఒక కాపురం కనిపించింది. ఇంటింటా మొబైల్ ముసలం పుట్టింది. 


(ముందు సరదాగా, తర్వాత మాటల్లో ఏదో ఆకర్షణ, తర్వాత ఓ వింత ప్రేమ కథ,  సగ భాగానికి జరిగే ద్రోహం. ఎక్కడ చూసినా ఇదే రకం ప్రేమ రోగం )