17, అక్టోబర్ 2026, శనివారం

ఐరనీ/ ప్రేమోన్మాదం

 



ఐరనీ

నువ్వు అడగాలే కానీ నా ప్రాణాలైనా 

యిస్తానంటావ్

నీ ప్రాణం తీసుకుని అసలు నేనుంటానా?

అందుకే నా యే కష్టాన్ని నీకు తెలియకుండా 

గోప్యంగా వుంచుతాను. 

అనుబంధమనే రుణంలో 

నిండా కూరుకుపోయాం మనం

జీవనరణంలో కాస్తంత ఓదార్పు పలుకులకు 

నోచుకోని జైలు పక్షులం

ఈ రహస్యపు నొప్పి లోలోపల నమిలేస్తున్నా 

బాహ్యంగా నవ్వుతూ జీవిస్తాం.

17/10/2026.  07:45 am.

#వనజతాతినేని

***********

ప్రేమోన్మాదం


గాఢంగా ప్రేమించడం కూడా 

వొక వ్యసనమేమో అంది నా మిత్రురాలు


అదే నా జీవం బలం బలహీనత 

అని ఆమెకెలా చెప్పను?


నా హృదయం ఉక్కు లాగా కఠినంగా వుండాలని 

నిన్ను మాత్రమే ప్రేమించాలని 

నేననుకున్నానా యేమిటి? 


నా జీవితంలో  పొందిన అరుదైన వరం

యేమైనా వుందంటే .. అది నీ ప్రేమే! 


ఒక రహస్యం చెప్పనా? 

నా మృదుత్వంలోని అసలైన శక్తి నువ్వే! 


నన్ను నేను ప్రేమించుకునే ఆసక్తి లేక

యితరులను ద్వేషించే అవసరం లేక 

నా ప్రేమకు నిన్నే కేంద్రంగా చేసుకున్నాను. 

అలా అని నా ప్రేమ నీకు సంకెల కానీయను. 


17/10/2026. 12:10pm.


*************


కామెంట్‌లు లేవు: