నేతవాడి నైపుణ్యం
నా ప్రేమలేఖని దొంగిలించారు యెవరో
వేరొకరికి దానితో పని యేముందబ్బా!
అది నువ్వు కాదు కదా!
ఎందుకు అని నేనడగను
దాన్ని భద్రంగా దాచుకుని చదువుతూ నవ్వుకుంటానని
నీకు ఉక్రోషం; అన్ని అతిశయోక్తులు.
నేతవాడు నూలు వడికి యెంతో శ్రద్దగా
చీర నేసినట్టు అందమైన లేఖలు నేసావు
ఆ అపురూప చింతామణులే కదా
నన్ను నీకు మచ్చిక చేసాయి.
నీ ప్రియశిష్యులతో
ప్రణయపత్రం రాయడం యెలాగో అభ్యాసం చేయిస్తున్నావా
నాకు వినిపించినట్టు రోమియో జూలియట్
ప్రేమకథను ఉత్కంఠభరితంగా వినిపిస్తున్నావా
వద్దు వద్దు, అర్దాంతరంగా కడతేరిన
ప్రేమ కథలకు ఆయుష్షు పోయవద్దు
నా ప్రియ కవీ! మన పూర్వ కవుల
కావ్య సంప్రదాయాన్ని గుర్తు చేసుకో!
విషాదపు గాలి వారిని ఆవహించకుండా
ప్రేమికులను పచ్చగా వర్ధిల్లనీ.
మన బాధ పగవారికైనా వద్దు.
*********
ఆకాశ కుసుమం
నీకూ నాకూ దీపానికి కాంతికి
పరికరాలకు సంగీతానికి
కాన్వాస్ కి కుంచెకు
పూవుకి తావికి
ఉలి కి శిల్పికి
వున్న అవినాభావ సంబంధం.
లేకపోతే ఉప్పు నిప్పు లాగా చిటపటలాడే మనం
ప్రేమలో యెందుకు తారసపడతాం చెప్పు!?
10/10/2026. 05:15 am.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి